ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : ఒకవైపు విద్యను సేవగా, మరొకవైపు వ్యాపారంగా మార్చుకొని రామగుండం నియోజకవర్గంలో కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు ఇప్పుడు చట్టాలకూ, నిబంధనలకూ మించి నడుస్తున్నాయి. కేవలం 90 రోజుల తాత్కాలిక అనుమతితో ప్రారంభించిన ఓ కార్పొరేట్ పాఠశాల, గడువు ముగిసినా ఇప్పటికీ నిరభ్యంతరంగా నడుస్తున్న సంబంధించిన కార్పొరేట్ పాఠశాలపై ఆయా అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఎన్నో అనుమానాలు తలుకుతున్నాయి. ఈ పాఠశాల సొసైటీ వ్యవహారం ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వరకు చేరినప్పటికీ, విద్యాశాఖ అధికారులు మాత్రం మూగవైఖరి అవలంబిస్తున్నారు.సొసైటీ నాది అంటే నాదే అని కొందరు వ్యక్తులు గొడవలకు దిగిపోవడంతో, సొసైటీ అంతర్గత వివాదం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. విద్యాసంస్థలు విద్యను పంచే ఆలయాలుగా ఉండవలసిన చోట, న్యాయపరమైన వివాదాలు, పోలీస్ కేసులు చోటు చేసుకోవడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పాఠశాలకు సంబంధించిన బిల్డింగ్, మున్సిపల్, ఫైర్, ట్రాఫిక్, ఎన్‌ఓసీ పర్మిషన్‌లు సరైనవిగా ఉన్నాయా అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పటి వరకు ఎవరూ ఇవ్వలేదు. ఈ అనుమతులన్నీ పూర్తయ్యాకే విద్యాసంస్థలు నడవాలన్న ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ, ఇక్కడ అవి పూర్తిగా విస్మరించబడ్డాయి. కార్పొరేట్ పేరుతో అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక దోపిడీ కొనసాగుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో భవిష్యత్తులో విద్యార్థులు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి, గ్రూప్ పరీక్షలకు దరఖాస్తు చేసుకుని ఉద్యోగం సాధించిన సమయంలో సదురు కార్పొరేట్ పాఠశాల వివిధ రకాల సొసైటీ పేరుతో ఇచ్చిన సర్టిఫికెట్లు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నేట్టే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వ ఉద్యోగానికి మొదటి నుంచి చివరి వరకు ప్రతి పాఠశాల సర్టిఫికెట్ ను క్షుణ్ణంగా పరిశీలించే ఈ పరిస్థితులలో వివిధ రకాల పేరుతో ఇచ్చే సర్టిఫికెట్లు విద్యార్థుల భవిష్యత్తును ఏ దిశగా తీసుకెళ్తాయి అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.ఇక పాఠశాల నడుస్తున్న చట్టబద్ధతపై తీవ్ర ప్రశ్నలు నెలకొన్నాయి. కేవలం 90 రోజుల అనుమతితో పాఠశాల నడపడం అంటే చట్టాన్ని తేలిగ్గా తీసుకోవడమే అని విద్యావేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. పాఠశాల యాజమాన్యంలోని సొసైటీ సభ్యుల మధ్య తలెత్తిన వివాదం కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో పడిపోయారు.ఈ సంస్థపై కేసులు నడుస్తున్న నేపథ్యంలో, ఇక్కడ చదివిన విద్యార్థులు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసినప్పుడు వారి విద్యాప్రమాణాలు చెల్లుతాయా లేదా?’’ అనే ఆందోళన తల్లిదండ్రుల్లో పెరుగుతోంది. విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి కార్పొరేట్ వ్యవస్థలు లాభాల కోసం ఆడుతున్న ఆటను నిరోధించాల్సిన బాధ్యత విద్యాశాఖపైనే ఉందని విద్యావేత్తలు స్పష్టం చేస్తున్నారు.ఇదే సమయంలో ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారుల మౌనం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఏమైనా ఈ పాఠశాల యాజమాన్యానికి అధికారులతో ప్రత్యేక సంబంధాలున్నాయా? అనే ప్రశ్నలు ప్రజల్లో చక్కర్లు కొడుతున్నాయి.ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉండగా, తల్లిదండ్రులు మాత్రం విద్యార్థుల భవిష్యత్తు చీకటిలో పడకూడదని కోరుతున్నారు. విద్యాశాఖ తక్షణ చర్యలు తీసుకుని చట్టపరమైన ప్రమాణాలు పాటించని కార్పొరేట్ పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.విద్యను వ్యాపారంగా మార్చిన ఈ తరహా కార్పొరేట్ పాఠశాలపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించకపోతే, రేపటి తరానికి చీకటి భవిష్యత్తు తప్పదని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడే పాఠశాలలు మూసివేయాలని 90 రోజుల పర్మిషన్‌తో నడిచే పాఠశాలలపై చర్యలు తీసుకోకపోవడం అంటే విద్యాశాఖ నిష్క్రియతకు నిదర్శనం స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Admin
Aakanksha News