Wednesday, 04 February 2026 05:41:04 AM

కిడ్నాప్ లు బెదిరింపులతో రామగుండంలో ఏకగ్రీవమా...

రామగుండంలో ఏకగ్రీవం పేరుతో బీజేపీ అభ్యర్థి కుటుంబానికి బెదిరింపులు.. స్టేట్ ఎలక్షన్ కమిషన్, డీజీపీకి బాధితురాలి ఫిర్యాదు...

Date : 02 February 2026 06:34 PM Views : 1832

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న ఎన్నికలు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతున్నాయి. రామగుండం కార్పొరేషన్ 1వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మహిళను, ఆమె కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేసి నామినేషన్ ఉపసంహరణ చేయించిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై బాధితురాలు స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు రమా బిశ్వాస్ భర్త పంకజ్ కుమార్ బిశ్వాస్. ఆమె ప్రస్తుతం ఎన్టీపీసీ పరిధిలోని ఇందిరమ్మ క్యాంప్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిపింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 1వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆమె నామినేషన్ దాఖలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే తమపై తీవ్ర ఒత్తిళ్లు మొదలయ్యాయని, రాజకీయ ప్రత్యర్థుల నుంచి మాత్రమే కాకుండా పోలీసుల పేరుతో కూడా బెదిరింపులు ఎదురయ్యాయని ఆమె ఆరోపించారు.ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, ఫిబ్రవరి 2వ తేదీ మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో ఎన్టీపీసీ పరిధిలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు ఆమె భర్త పంకజ్ కుమార్ బిశ్వాస్‌ను,ఆయన పనిచేస్తున్న ఎన్టీపీసీ కాంట్రాక్ట్ యాజమాన్యం ద్వారా పిలిపించారని తెలిపింది. అక్కడికి వెళ్లిన అనంతరం, పోలీస్ అధికారులు భయభ్రాంతులకు గురిచేస్తూ “నీ మీద గంజాయి కేసు పెడతాం, జైలుకు వెళ్లాలా లేక నామినేషన్ విత్‌డ్రా చేసుకుంటావా” అంటూ బెదిరించినట్లు ఆరోపించింది. ఈ మాటలతో భర్త తీవ్రంగా భయపడ్డాడని, కుటుంబ భవిష్యత్తుపై ఆందోళనకు గురయ్యాడని ఆమె పేర్కొన్నారు.ఇదే సమయంలో, 1వ వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థికి అనుచరులుగా చెప్పుకునే మడివెల్లి మల్లేష్ అనుచరులు కూడా తన భర్తను బెదిరించారని ఫిర్యాదులో ఉంది.నువ్వు ఒక్కడివే డ్యూటీకి వెళ్లి వస్తావు, మార్గమధ్యంలో ఏదైనా జరిగితే నీకు ఎవరూ ఉండరు” అంటూ తీవ్రంగా హెచ్చరించారని, ఈ బెదిరింపులు తమ కుటుంబాన్ని మరింత భయాందోళనలకు గురిచేశాయని ఆమె వివరించారు. ఇక్కడితో ఆగకుండా, తన వద్దకు ఒక వ్యక్తిని పంపించి తన చిన్నపిల్లాడైన కుమారుడిని కూడా ప్రస్తావిస్తూ “నామినేషన్ విత్‌డ్రా చేసుకోక పోతే అప్పుడు చూస్తాం” అంటూ బెదిరించారని బాధితురాలు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడి, భయభ్రాంతుల మధ్య తనతో బలవంతంగా వీడియో స్టేట్‌మెంట్ రికార్డు చేయించారని, అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి తీసుకెళ్లి పలు పత్రాలపై సంతకాలు చేయించి నామినేషన్ ఉపసంహరణ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము ఈ విషయం గురించి తమ పార్టీకి చెందిన నాయకులకు చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ, “మీ కుటుంబం అంతు చూస్తాం, ఇక్కడ ఎలా బతుకుతారో చూస్తాం” అంటూ మరింత తీవ్రంగా బెదిరించినట్లు ఆమె ఆరోపించారు. దీంతో తమకు, తమ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా భర్తకు ప్రాణహాని ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాలరాస్తూ, భయబ్రాంతులకు గురిచేసి నామినేషన్ ఉపసంహరణ చేయించడం రాజ్యాంగ విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.ఈ ఘటనపై పెద్దపల్లి జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాల్సి ఉండగా, ఇలా అభ్యర్థులను బెదిరించడం, నామినేషన్ ఉపసంహరణకు బలవంతం చేయడం ఎన్నికల నైతిక విలువలకు విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పోలీస్ అధికారుల పేరుతో బెదిరింపులు జరిగాయన్న ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. బాధితురాలి ఫిర్యాదు నేపథ్యంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్, డీజీపీ ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ప్రక్రియలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఘటన రాజకీయ వేడిని మరింత పెంచింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :