ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : తెలంగాణ నుంచి నీళ్ల తరలింపుపై మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్రలకు తెరలేపారు. బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో పచ్చబడ్డ రాష్ట్రాన్ని మళ్లీ ఎండబెట్టే పన్నాగానికి పదునుపెట్టారు. వివాదాస్పదమైన బనకచర్ల పథకాన్ని తెరపైకి తెచ్చారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒక సభలో మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం కట్టుకుంటే మేం అడ్డుకున్నామా? గోదావరి వృథాజలాల ఆధారంగా బనకచర్ల కట్టుకుంటే తప్పేమిటి?’ అంటూ వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. జలరంగ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. అసలు గోదావరి బేసిన్‌లో ఉన్నవి మిగులు జలాలేనని, వరదజలాలు ఎక్కడివని ప్రశ్నిస్తున్నారు. గతంలో పలు సందర్భాల్లో గోదావరి ట్రిబ్యునల్ చెప్పిన విషయాలను ఉటంకిస్తున్నారు.కానీ, చంద్రబాబు మాత్రం ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ బనకచర్లపై ముందుకెళ్తున్నారని ఆక్షేపిస్తున్నారు. ఒకవేళ, ఏపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును నిర్మించాలనుకుంటే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని జలరంగ, న్యాయ నిపుణులు చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించి పర్మిషన్ వచ్చిన తర్వాతే ముందుకెళ్లాల్సి ఉంటుందని స్పష్టంచేస్తున్నారు. కేటాయింపులేని వరద జలాలను సాకుగా చూపి మన నీళ్లను తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం కట్టుకుంటే తాము అడ్డుకోలేదంటూ అక్కసు వెళ్లగక్కారని తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. చంద్రబాబు కుట్రలపై తెలంగాణ సర్కారు ఉదాసీనంగా వ్యవహరించవద్దని, వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో పొతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు తెలంగాణ ప్రజలు నీళ ్లకోసం అల్లాడే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు కూడా రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెడితే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.
Admin
Aakanksha News