ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే పై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆదివారం జరిగిన కామెడీ షోలో కమ్రా మాట్లాడుతూ.. థాణే నుంచి వచ్చిన ఓ నాయకుడు.. బీజేపీతో చేతులు కలిపి శివసేనను చీల్చేశాడని, అతడు దేశద్రోహి అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు మహా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఏక్‌నాథ్ షిండే తొలిసారి స్పందించారు. కమెడియన్ వేసిన సెటైర్ తనకు అర్థమైందని, అయితే దేనికైనా పరిమితి ఉండాలని వ్యాఖ్యానించారు.బీబీసీ మరాఠీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షిండే మాట్లాడుతూ.. ‘ప్రతీ వ్యక్తి ఒక నిర్దిష్ట స్థాయిని కొనసాగించాలి. లేదంటే చర్య ప్రతిచర్యకు కారణమవుతుంది. భారత రాజ్యాంగం ప్రతీ పౌరుడికీ తన అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ (ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్) ఇచ్చింది. కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది. నాపై ఇలాంటి సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లు ఉంది’ అని షిండే వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ముఖ్యమని.. కానీ వేరే వారి తరఫున ఇతరుల గురించి ఇలా తప్పుగా మాట్లాడటం సరికాదన్నారు.
Admin
Aakanksha News