Saturday, 27 June 2026 10:10:14 PM

భవిత శ్రీ ప్రశ్నార్థకం… బంగారు భవిష్యత్తు అంధకారం…

✅ ఉమ్మడి జిల్లాల్లో వేల సంఖ్యలో బాధితులు...

Date : 23 November 2025 11:53 AM Views : 483

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : వరంగల్ కేంద్రంగా మొదట ఏర్పాటు చేసిన భవిత శ్రీ చిట్ ఫండ్ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా శాఖలు, ఉప శాఖలుగా కార్యకలాపాలు నిర్వహించిన భవిత శ్రీ చిట్స్ సంస్థపై మోసపూరిత వ్యవహారాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే వరంగల్ సహా పలుచోట్ల కేసులు నమోదవ్వగా, కొత్తగా భూపాలపల్లి జిల్లాలోకి కూడా ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన బాధిత దంపతులు దేవునూరి జయప్రద–రాములు దంపతులు సుబేదారి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడంతో మరో కేసు నమోదు అయింది. టీచర్ గా పనిచేస్తున్న రామకృష్ణ సూచనతో 27 నెలల చిట్ పేరు మీద మరో 23 నెలలు చెల్లింపులు జరపాలని నమ్మబలికినట్లు బాధితులు తెలిపారు. 2020 అక్టోబర్‌లో చిట్ కాలపరిమితి ముగిసినప్పటికీ, తమకు రావలసిన రూ. 15 లక్షలు తిరిగి ఇవ్వలేదని బాధితులు వాపోయారు.తాను పూచీకత్తుగా ఉంటానని రామకృష్ణ నాన్-జ్యుడిషియల్ స్టాంపుపై రాసి ఇచ్చినప్పటికీ, ముఖ్య మొత్తాన్ని చెల్లించకుండా రూ. 2 వడ్డీ చొప్పున కొంత కాలం వరకు మాత్రమే చెల్లింపులు జరిపినట్లు బాధితులు వివరించారు. తమ కూతురు వివాహం జరపాల్సి ఉన్న నేపథ్యంలో డబ్బులు అడిగినప్పుడు రూ. 12 లక్షలు మాత్రమే వస్తాయని, ఇందుకు 200 గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తామని ఆశ చూపిన రామకృష్ణ అనంతరం మాట తప్పాడని బాధితులు ఆరోపించారు.పదేపదే అడిగిన తర్వాత మూడు నెలల అనంతరం రూ. 2.50 లక్షలు మాత్రమే అకౌంట్‌కు బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్లాట్ ఇస్తామని చెప్పి తిరిగి డబ్బులు పంపడం పై ప్రశ్నిస్తే రామకృష్ణ ప్రతి దాడికి దిగాడని, “మీరు చెల్లించిన డబ్బులు నాకు కావు చిట్ సంస్థ యాజమాన్యాన్ని అడగండి” అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితులు తెలిపారు.భవిత శ్రీ చిట్స్ ఛైర్మన్ గుండా ప్రకాష్ రావు, మేనేజింగ్ డైరెక్టర్ తాటిపల్లి శ్రీనివాస్, ఉద్యోగి సురేష్ లతో అనేక సార్లు సంప్రదించేందుకు ప్రయత్నించినా డబ్బులు తిరిగి ఇవ్వలేదని బాధితుల ఫిర్యాదులో పేర్కొన్నారు. వడ్డీ మినహాయించి ఇప్పటికీ రూ. 9.50 లక్షలు రావాల్సి ఉందని, సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సుబేదారి పోలీసులు ఈ మేరకు భవిత శ్రీ చిట్ ఫండ్ యాజమాన్యం మరియు ఏజెంట్ పై కేసు నమోదు చేశారు.అయితే చిట్ ఫండ్ చట్టం ప్రకారం...సభ్యుల వివరాలు..చిట్ విలువ, సభ్యుల సంఖ్య..డివిడెండ్ వివరాలు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కార్యాలయ అనుమతి...చిట్ విలువకు సరిపడ డిపాజిట్ లేదా ఆస్థి భద్రత ఇవి తప్పనిసరి వీటిని ఆయా శాఖ అనుమతులు ఇచ్చే సమయంలో పరిశీలించిందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న బ్రాంచ్ లలో నియమ నిబంధనలు చిట్టి వివరాలు వాటికి సంబంధించిన వాటిని అసలు అధికారులు పరిశీలించారా లేదా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే దేవునూరి జయప్రదను సభ్యురాలిగా చేర్చేటప్పుడు అనుమతి తీసుకున్నారా? ఆయా బ్రాంచ్ చిట్స్‌కు తగిన డిపాజిట్లు చేశారా? ప్లాట్లు ఆఫర్ చేయడం చట్టబద్ధమా? అన్న అంశాలు ఇప్పుడు విచారణ పథంలో ఉన్నాయి. ఒకవేళ డిపాజిట్ లేదా చూపిన ఆస్థులు రికార్డులో ఉన్నట్లయితే, వాటిని వేలం వేసి బాధితులకు చెల్లించే మార్గం ఉంటుంది. లేకపోతే నిబంధనల ఉల్లంఘన, అక్రమ చిట్ నిర్వహణ కేసులు నమోదు కానున్నాయి.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల కుంభకోణం...?

రాష్ట్రవ్యాప్తంగా భవిత శ్రీ చిట్ సంస్థ నిర్వహించిన చిట్టీల సంఖ్య,బదిలీ చేసిన నగదు, లబ్ధిదారుల అసలు వివరాలు పూర్తి స్థాయిలో పరిశీలిస్తే వేల కోట్ల రూపాయల కుంభకోణం బయటపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.ప్రస్తుతం బాధితులు పెరుగుతుండగా, విచారణ వేగవంతం చేయాలని జనవాణి గట్టిగా వినిపిస్తోంది. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపడితే అవినీతి కుంభకోణాలు బయటపడతాయని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :