ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : న్యాయాన్ని పరిరక్షించే బాధ్యత వహించే న్యాయవాదులపై పోలీసులు దమనకాండకు దిగుతున్నారని గోదావరిఖని న్యాయవాదులు తీవ్రంగా ఆరోపించారు. ఈ నెల 10వ తేదీన గోదావరిఖనిలో న్యాయవాది తిలక్‌పై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ గన్‌మన్ దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనను ప్రశ్నించిన న్యాయవాదులపై వన్‌టౌన్ సీఐ దుర్భాషలాడుతూ న్యాయవాద వ్యవస్థను అవమానించేలా ప్రవర్తించాడని వారు ఆరోపించారు.ఈ ఘటనకు నిరసనగా గోదావరిఖని న్యాయవాదులు 11వ తేదీ నుండి కోర్టు బహిష్కరణ చేపట్టి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. సీఐపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ కమిషనర్‌కు విన్నప పత్రం సమర్పించినట్లు తెలిపారు. అదేవిధంగా నిన్న జరిగిన ఘటనలో సంబంధిత అధికారిపై అధికారికంగా ఫిర్యాదు కూడా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. న్యాయవాదులు సమాజానికి న్యాయం అందించే కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుండగా వారిపైనే దాడులు జరగడం అత్యంత గర్హనీయమని న్యాయవాదులు మండిపడ్డారు. పోలీసులు తప్పు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వహించాలి గాని, న్యాయవాదులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వారు అభిప్రాయపడ్డారు.ఇటీవల జరిగిన మరో సంఘటనలో ఇంటికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో న్యాయవాది తిలక్‌ను అడ్డగించి దాడి చేయడం, ఆయన వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్‌ను గుంజుకోవడం వంటి ఆరోపణలు కూడా వెలుగుచూశాయి. ఫోన్ ద్వారా సీఐ డబ్బులు పంపించాలని సూచించినట్లు బాధితుడు పేర్కొన్నాడు.ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు సంఘీభావం తెలపాలని గోదావరిఖని న్యాయవాద సంఘం పిలుపునిచ్చింది. ఫెడరేషన్ ఆధ్వర్యంలో తదుపరి కార్యాచరణను రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది. శనివారం వరకు బహిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టి నిరసనను మరింత ఉధృతం చేయనున్నట్లు న్యాయవాదులు తెలిపారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. గోదావరిఖనిలో చోటుచేసుకున్న ఈ సంఘటన న్యాయవాదుల భద్రతపై ప్రశ్నార్థకంగా మారింది.
Admin
Aakanksha News