ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : మహిళల ఆర్థిక స్వావలంబనతోనే సమాజాభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ, తాము గెలుపొందిన వెంటనే మహిళా సోదరీమణులకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కుర్చీ గుర్తు అభ్యర్థి గుండు రాజు ప్రకటించారు. మహిళలు ఇంటి వద్దనే పని చేసుకుంటూ ఆదాయం సంపాదించేలా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ల శిక్షణ అందించి, స్వయం ఉపాధి దిశగా ముందుకు నడిపిస్తామని తెలిపారు. శిక్షణ పూర్తయ్యాక అవసరమైన వారికి కుట్టుమిషన్లు అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు.అలాగే ఉపాధి నిమిత్తం పని చేయదలచుకున్న మహిళల కోసం పేపర్ ప్లేట్లు తయారు చేసే మిషన్లు ఏర్పాటు చేసి, నిరంతర ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గ్రామీణ, పట్టణ మహిళలకు అనుకూలంగా అప్పడాలు, పాపడాలు తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి, మార్కెట్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు.మహిళా ఉపాధి అవకాశాలను మరింత విస్తరించేందుకు రెడీమేడ్ దుస్తులు తయారు చేసే గార్మెంట్ యూనిట్ ఏర్పాటు చేయడంతో పాటు, స్కూల్ బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు తయారీ ద్వారా మహిళలకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ అన్ని కార్యక్రమాలు మహిళల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఉంటాయని అన్నారు.మహిళల శ్రమకు తగిన గుర్తింపు, ఆదాయం లభించేలా పాలన సాగిస్తామని స్పష్టం చేసిన ఆయన, అభివృద్ధి కోసం తమకు మద్దతుగా కుర్చీ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. మహిళా సంక్షేమమే తమ పాలనకు పునాదిగా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Admin
Aakanksha News