Sunday, 27 September 2026 07:03:36 AM

వచ్చే ఏడాది దసరా నాటికి నిర్మాణాలు పూర్తి చేస్తాం....

ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల శంకుస్థాపనలో  మంత్రి శ్రీధర్ బాబు..

Date : 11 October 2024 04:37 PM Views : 369

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : వచ్చే ఏడాది దసరా నాటికి నిర్మాణాలు పూర్తి చేసి ప్రపంచ మేటీ విద్యార్థులను తయారు చేసేలా యంగ్ ఇండియా విద్యా సంస్థల ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  ఎంపి గడ్డం వంశీ, జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్షతో కలిసి మంథని మండలంలో అడవి సోమనపల్లి గ్రామంలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల పనులకు శంకుస్థాపన  చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... మార్పు తీసుకవచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమక్రమంగా అమలు చేస్తున్నామన్నారు.  గ్యారెంటీ పథకాలలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల సబ్సిడీ సిలిండర్ అమలు చేశామని, ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమం వచ్చే నెల నుంచి ప్రారంభింనున్నామన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా, బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు  సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, క్యాబినెట్ సహచరులు ఎన్నికల సమయంలో చెప్పిన మాట ప్రకారం విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. యంగ్ ఇండియా సమీకృత విద్యా సంస్థల క్రింద ప్రభుత్వం మొదటి విడతలో 28 పాఠశాలలను మంజూరు చేసిందని, మంథని నియోజకవర్గంలోని అడవి సోమనపల్లి గ్రామంలో యంగ్ ఇండియా సమీకృత విద్యా సంస్థ రావడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించిన డిఎస్సీ నియామకం అంశాన్ని రికార్డు సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి ఇటీవల ముఖ్యమంత్రి చేతుల మీదుగా 11 వేలకు పైగా నూతన టీచర్లను నియమించడం జరిగిందన్నారు. ఇదే గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ అనే యువకుడికి ఎస్.జి.టి ఉద్యోగం లభించిందన్నారు.  గడిచిన 10 ఏళ్ళలో పెండింగ్ ఉన్న  టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేశామని, విద్యాశాఖను మెరుగుపరిచేందుకు కమిషన్ ను ఏర్పాటు చేశామని, అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని వసతులతో కుల, మత భేదాలు లేకుండా మన విద్యార్థులకు విద్యాబోధన అందించేందుకు ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థను మంజూరు చేస్తుందని, 25 ఎకరాల విస్తీర్ణంలో ఎస్సి, ఎస్టీ ,బీసి, మైనారిటీ  వంటి అన్ని రంగాల విద్యార్దులు ఒకే ప్రాంగణంలో చదివేలా ఈ విద్యా సంస్థ ఉంటుందన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థలో  4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన అందుతుందని, విద్యార్థుల సౌకర్యం కొరకు తరగతి గదులలో డిజిటల్ స్మార్ట్ బోర్డ్, కంప్యూటర్ ల్యాబ్ , 5 వేలకు పైగా పుస్తకాలతో కూడుకున్న గ్రంథాలయం తదితర అత్యాధునిక సౌకర్యాలతో 25  ఎకరాల విస్తీర్ణంలో విద్యాసంస్థ నిర్మాణం ఉంటుందన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల్లో క్రికెట్ , ఫుట్ బాల్ ,బాస్కెట్ బాల్, టెన్నిస్ మొదలగు క్రీడలు ఆడేందుకు అవసరమైన గ్రౌండ్, ఇతర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. వచ్చే సంవత్సరం దసరా నాటికి ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థల నిర్మాణం పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొని వస్తామని, అన్ని వర్గాల విద్యార్థులు ఒకేచోట అంతర్జాతీయ స్థాయి విద్య అందుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ విద్యా సంస్థలలో ,2500 పైగా విద్యార్థుల చదువుకుంటారని, వీరికి 120 మంది టీచర్లను కేటాయించడం జరుగుతుందన్నారు. గ్రీన్ ఎనర్జీ ద్వారా సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా చర్యలు తీసుకుంటామని, రూ 250 నుంచి 300 కోట్లు ఖర్చు చేసి ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల నిర్మాణం చేస్తున్నామని త్వరలో రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ లను మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. అనంతరం మంత్రి గౌడ కులస్తులకు  కాటమయ్య రక్షక కవచ కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతి రక్షక కవచ కిట్ పై సుమారు రూ. 9 వేలు ఖర్చు చేసి ఉచితంగా గౌడ సోదరులకు అందిస్తుందని, చెట్టు పై కల్లు తీసేందుకు వెళ్లినప్పుడు ఈ కిట్ ఉపయోగించడం వల్ల ప్రమాదాలను నియంత్రించవచ్చని, ప్రతి గౌడ సోదరుడు ఈ కిట్ ను వినియోగించాలన్నారు. చెట్టు పైకి ఎక్కి కళ్ళు తీసే గౌడ సోదరులను గుర్తించి కాటమయ్య రక్షక కిట్లను ముందుగా పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ  పిల్లలకు అవసరమైన వసతులతో కూడిన రెసిడెన్షియల్ విద్యా సంస్థ ఆశించిన స్థాయిలో లేవని గమనించి ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందని, ముందస్తుగా 28 నియోజకవర్గాలలో నేడు శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు. మన జిల్లాలో మంథని అసెంబ్లీ నియోజకవర్గంలోని అడవి సోమనపల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థ మంజూరు కావడం జరిగిందన్నారు. 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థ నిర్మిస్తున్నామని, భవిష్యత్తు అవసరాల కోసం మరో 5 ఎకరాలు విస్తరించే అవకాశం సైతం ఇక్కడ ఉందని, గ్రామ ప్రజలకు ఇబ్బంది కలుగకుండ ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థ కోసం 900 మీటర్ల ప్రత్యేక 4 లైన్ రోడ్డు వేసేందుకు ప్రతిపాదనలు రూపొందించామని, నాణ్యతతో కూడిన భవన నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ రమ,ఆర్అండ్ బి ఈఈ భావ్ సింగ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్, ఎక్సైజ్ సూపరిండెంట్ మహిపాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :