ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : విద్యను వ్యాపారంగా మార్చి, అధిక ఫీజులు వసూలు చేస్తూ, పాఠ్యపుస్తకాల పేరుతో ఆర్థిక దోపిడీ చేస్తున్న నారాయణ విద్యాసంస్థలపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. గోదావరిఖని మార్కండేయ కాలనీలోని నారాయణ పాఠశాల ఎదుట మంగళవారం ఏఐఎస్ఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్లాకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో ఆందోళనకు దిగిన ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణిగుంట్ల ప్రీతం మాట్లాడుతూ.. నారాయణ పాఠశాల వ్యవస్థలు విద్యను వ్యాపారంగా మారుస్తూ, ఫీజులు, పాఠ్యపుస్తకాల పేర్లపై తల్లిదండ్రులపై భారీ భారం మోపుతున్నాయి. కొన్ని పుస్తకాలను మార్కెట్ ధరకంటే రెట్టింపు ధరకు అమ్ముతున్నారు. ఇది పూర్తిగా విద్యారంగాన్ని తారుమారు చేసే విధంగా ఉంది,” అని విమర్శించారు.విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, ఇటువంటి అక్రమాలను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. నిబంధనలు పాటించకుండా నడుస్తున్న ఈ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, అధికారుల అవగహనలోనైన కానీ చర్యలు తీసుకోక పోవడాన్ని ప్రస్తావించిన ఆయన, “ఇది తల్లిదండ్రులకు భరించలేని ఆర్థిక భారం. విద్యా వ్యవస్థను వ్యాపార వేదికగా మార్చిన యాజమాన్యంపై నిర్లక్ష్యం చేసిన అధికారులపై కూడా విచారణ జరగాలి,” అన్నారు. ఈ ఘటనపై జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అవసరమైతే రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.తల్లిదండ్రులు, సామాజిక శ్రేణులు, విద్యార్థి సంఘాలు కలిసి ఇలాంటి దోపిడీని ఎదుర్కోవాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.
Admin
Aakanksha News