ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థపై తాజాగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదవడం కలకలం రేపింది. పాఠశాల నిర్వహణపై తీవ్ర ఆరోపణలతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పాఠశాల అనుమతులు, నిర్వహణ పరమైన పారదర్శకతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది. విద్యాశాఖ అధికారుల మౌనమే ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది. అనుమతులు లేకుండానే పాఠశాల కొనసాగుతున్నా, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంబంధిత శాఖ అధికారులకు పాఠశాల అనుమతుల వివరాలు లభ్యమవలసిన పరిస్థితిలో ఉండగా, ఇప్పటికీ ఎందుకు సరైన సమాచారం లేదు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులు ప్రభుత్వ అధికారులు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాఠశాలపై అనేక ఫిర్యాదులు వచ్చినా సంబంధిత శాఖ నుంచి స్పందన లేకపోవడమే వెనక కొంత అంతర్గత ఒత్తిళ్లు, సెటిల్మెంట్ల ప్రాబల్యం ఉందని పలువురు భావిస్తున్నారు. "మామూలు మత్తులోనా..? మాయల మత్తులోనా..? సెటిల్మెంటా..? సేల్‌మెంటా..?" అనే ప్రశ్నలు సామాన్య ప్రజల్లో వినిపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న ఈ వ్యవహారంపై విచారణకు సంబంధిత అధికారులు హాజరవుతారో లేదోనన్నది ఇప్పుడు కీలక అంశంగా మారింది.నేడు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరగనున్న విచారణకు విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరవుతారా లేదా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలు వెలికితీసి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది.విద్యార్థుల భద్రత, నాణ్యమైన విద్యకు గౌరవం ఇచ్చే నైతిక బాధ్యతను అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు, విద్యాభిమానులు కోరుతున్నారు. ఈ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసినపుడే ప్రజల్లో నమ్మకం పుట్టే అవకాశం ఉందని వాఖ్యలు వ్యక్తమవుతున్నాయి.
Admin
Aakanksha News