ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / ఓదెల(పెద్దపల్లి జిల్లా) : దేవీ శరన్నవరాత్రులు హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పండుగ. శక్తి స్వరూపిణి జగన్మాత తొమ్మిది రోజులపాటు మహిషాసురుడితో యుద్ధం చేసి చెడుపై గెలిచిన విజయాన్ని గుర్తు చేసుకునే ఉత్సవం ఇది. ఆ పండుగలో భక్తి భావంతో పాటు సమాజ స్ఫూర్తిని రగిలిస్తూ పొత్కపల్లి యువత దశాబ్దకాలంగా దుర్గాభవాని కమిటీ పేరిట విశిష్టమైన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.పొత్కపల్లి శివాలయంలో గత పదేళ్లుగా యువత ఆధ్వర్యంలో భవాని మాత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల ద్వారా వారు హిందూ ధర్మ పరిరక్షణలో భాగమవుతూ, చెడుపై పోరాటానికి సిద్ధమని స్పష్టంగా తెలియజేస్తున్నారు. కులాలకతీతంగా దాదాపు నలభైమంది యువకులు ఒకే తాటిపైకి వచ్చి భక్తిశ్రద్ధలతో భవాని మాత సేవలో తరిస్తూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.సనాతన ధర్మాన్ని, భక్తి మార్గాన్ని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో నడుస్తున్న ఈ యువత, చత్రపతి శివాజీ మహారాజ్ ప్రారంభించిన భవాని మాత ఉత్సవాలను మరింత ఘనంగా కొనసాగిస్తున్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు భక్తి మార్గాన్ని త్రికరణ శుద్ధిగా అనుసరిస్తూ యువతకి ఆదర్శంగా నిలుస్తున్నారు.పొత్కపల్లి యువత భక్తితో పాటు సామాజిక చైతన్యాన్ని కూడా వెలిగిస్తున్నారు. హెల్మెట్ ధారణ ప్రాణరక్షక కవచమని, స్వదేశీ ఉత్పత్తుల వినియోగం దేశభక్తికి ప్రతీక అని, విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తు వెలుగొందుతుందని అవగాహన కల్పిస్తున్నారు. మాదకద్రవ్యాలు, మద్యం, జూదం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సమాజానికి హితబోధ చేస్తున్నారు.అదేవిధంగా స్థానిక శివాలయ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించి మన సంస్కృతిని కాపాడే దిశగా కృషి చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలు కేవలం పండుగ కాదు, ఊరిని ఏకతాటిపైకి తెచ్చే శక్తి అని చెబుతూ ప్రజల్లో ఆధ్యాత్మిక భావనతో పాటు సామాజిక బాధ్యతను కలిగిస్తున్నారు. సర్వేజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు” అనే సారాన్ని మంత్రంగా చేసుకుని ముందుకు సాగుతున్న పొత్కపల్లి యువత, భక్తి–సేవ–సామాజిక చైతన్యంతో సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Admin
Aakanksha News