ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : ముత్తారం మండలం మచ్చుపేట గ్రామంలో జరిగిన దుర్ఘటనతో గ్రామం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. పంచాయతీ ఎన్నికల పోటీలో విజయాన్ని అందుకున్న కుటుంబంలో ఆనందం నెలకొనే లోపే, భర్త అనూహ్య మరణంతో తీరని విషాదం నెలకొంది.వివరాల్లోకి వెళ్తే..మచ్చుపేట గ్రామానికి చెందిన పోలుదాసరి శ్రీనివాస్ (38) తన భార్య శ్రీలతను పంచాయతీ ఎన్నికల్లో 4వ వార్డ్ మెంబర్ పదవికి పోటీ చేయించారు. ఎన్నికల ప్రచారంలో దంపతులు ఇద్దరు కలిసి ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ప్రజలతో కలసిన కుటుంబం కూడా ఎన్నికలలో విజయం సాధించాలని పరితపించిన శ్రీనివాస్–శ్రీలత దంపతులకు ఊహించని విషాదం ఎదురైంది.ఈనెల 9న తెలియని కారణాలతో శ్రీనివాస్ పురుగుల మందు సేవించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు తొలుత ఆయనను పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతరం కరీంనగర్ దవాఖానకు తరలించగా ఆయన పరిస్థితి ఇంకా విషమించడంతో హైదరాబాదుకు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్ మరణించాడు.
*ఓటర్లు గెలిపించారు… కానీ ఇంట్లో కన్నీళ్లు...*
దంపతులు ఇద్దరూ కలిసి ఎన్నో రోజులుగా ప్రచారం చేసిన వార్డ్ ఎన్నికలు భర్త మరణ యాతనలోనే కొనసాగాయి.రెండు రోజులుగా ఆసుపత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్న శ్రీనివాస్ పరిస్థితి తెలియకుండా, గ్రామంలో పోలింగ్ జరుగగా ఓటర్లు శ్రీలతను వార్డ్ మెంబర్‌గా గెలిపించారు.విజయోత్సవాలు జరగాల్సిన ఇంటిలో అపార విషాదం నెలకొంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని గంటల్లోనే భర్త మరణ వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.విజయం కంటే ప్రాణం మిన్న అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరణానికి కారణం స్పష్టతలో లేదు.శ్రీనివాస్ పురుగుల మందు ఎందుకు సేవించాడన్న విషయం ఇంత వరకు స్పష్టంగా తెలియలేదు. కుటుంబంలో ఏదయినా వివాదం ఉందా? ఏదైనా ఒత్తిడి లేదా ఇతర సమస్యలున్నాయా? అన్న దానిపై కూడా స్పష్టత లేదు. కుటుంబ సభ్యులు పూర్తిగా దుఃఖ శోకంలో ఉండటంతో వివరాలు వెల్లడించలేక పోతున్నారు. శ్రీనివాస్ ఆకస్మిక మరణంతో మచ్చుపేట గ్రామం అంతా దుఃఖసాగరంలో మునిగి పోయింది. ఎన్నికల హడావుడి మధ్య చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటన గ్రామ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
Admin
Aakanksha News