ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో రేషన్ బియ్యం దందా జోరుగా నడుస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంత మంది అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని స్థానికంగా ఉండే ఓ రైస్ మిల్లుకు తరలిస్తూ అక్రమ సంపాదనకు తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరిఖనిలో ఓ ఇద్దరు రేషన్ దందా నిర్వాహకుల మధ్య ఘర్షణ జరిగినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వివరాల్లోకి వెళ్తే... విఠల్ నగర్ కు చెందిన అక్రమ రేషన్ బియ్యం దందా నిర్వహించే ఓ వ్యక్తికి మార్కండేయ కాలనీకి చెందిన ఓ వ్యక్తి బియ్యాన్ని ప్రతి నెల సరఫరా చేసే వాడు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుండి బియ్యాన్ని పంపించకపోవడంతో సదురు వ్యక్తి ఆరా తీశాడు. ఈ క్రమంలోనే మార్కండేయ కాలనీ కి చెందిన సదరు వ్యక్తి అడ్డగుంటపల్లికి చెందిన ఓ స్క్రాప్ నిర్వాహకుడికి బియ్యాన్ని సరఫరా చేస్తున్నాడనే విషయాన్ని తెలుసుకొని సదరు వ్యక్తిని నిలదీశాడు. దీంతో పాటు ఇరువురు ఒకరికొకరు ఫోన్ లో దూషించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇంతటి తో కాకుండా విఠల్ నగర్ కు చెందిన సదరు వ్యక్తి అడ్డగుంటపల్లి కి చెందిన అక్రమ స్క్రాప్ నిర్వాహకుడిని నిలదీసే క్రమంలో వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుని ఒకరినొకరు కొట్టుకున్నట్లు జోరుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చర్చ సాగుతుంది. ఇందులో ఓ బియ్యం దందా నిర్వాహకుడికి గాయాలైనట్లు సమాచారం. గత వారం రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Admin
Aakanksha News