ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : అన్నా యూనివర్సిటీ లో లైంగిక దాడి ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలను అక్కడి బీజేపీ తప్పుపట్టింది. అసెంబ్లీలో సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని తమిళనాడు బీజేపీ సహ ఇన్‌చార్జి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిందితుడు డీఎంకే సభ్యుడు కాదని, కేవలం డీఎంకే సానుభూతిపరుడు మాత్రమేనని సీఎం స్టాలిన్ చెప్పడం దారుణమని అన్నారు.అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు డీఎంకే సభ్యుడు కాదని, కేవలం డీఎంకే సానుభూతిపరుడు మాత్రమేనని సీఎం ఎలా చెప్పగలిగారని సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. నిందితుడు డీఎంకే సానుభూతిపరుడు కాబట్టే తాము ఘటనపై సీబీఐ దర్యాప్తు కోసం డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయిస్తే అంతా సవ్యంగా ఉంటుందని అన్నారు.అన్నా యూనివర్సిటీ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ నైతిక బాధ్యతతో స్పందిస్తారని తాము ఆశించామని, కానీ ఆయన స్పందన అందుకు విరుద్ధంగా ఉన్నదని సుధాకర్‌రెడ్డి విమర్శించారు. అన్నా వర్సిటీ అంశంపై సరిగా స్పందించకపోగా గవర్నర్‌పై విమర్శలకు దిగి.. అసలు విషయాన్ని మరుగున పడేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తాము లైంగిక దాడిపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నామని, లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అన్నారు.
Admin
Aakanksha News