ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : డిసెంబర్ 4 వ తేదీన పెద్ద పల్లిలో నిర్వహించే యువ వికాసం సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై దాదాపు 9000 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందచేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. పెద్ద పల్లిలో డిసెంబర్ 4వ తేదీన తలపెట్టిన ముఖ్యమంత్రి గారి సభా ఏర్పాట్లపై నేడు సంబంధిత అధికారులు, జిలా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజా విజయోత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యువత కై ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ సభలో ఇటీవల గ్రూప్ IV తోపాటు ఎంపికైన సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, సింగరేణిలో ఉద్యోగాలు పొందిన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నియామక పత్రాలను అందచేస్తారని వివరించారు. ఈ సభలోనే స్కిల్ యూనివర్సిటీలో బాగస్వామ్యమయ్యే 7 ఏజెన్సీలతో ఒప్పంద పత్రాలను సంతకం, డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ప్రారంభోత్సవం, సి.ఎం కప్ ప్రారంభం లతో పాటు వందలాది కోట్ల రూపాయల విలువైన అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. వివిధ రంగాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను తెలియచేసే దాదాపు పలు స్టాళ్లను ఈ సభా వేదిక వద్ద ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సభకు హాజరయ్యే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. బస్సుల్లో వచ్చే వారు మధ్యాహ్నం రెండున్నర వరకల్లా వేదిక వద్దకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
Admin
Aakanksha News