ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కల్తీ కల్లును అరికట్టలేని ఎక్సైజ్ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) ఆధ్వర్యంలో ప్లకార్డులతో స్థానిక గోదావరిఖని చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపురి సూర్య హాజరై మాట్లాడుతూ.. " నీరా, కల్లు అమ్మడానికి సొసైటీల అనుమతులు పొంది ఆర్దిక దురాశతో నిషేధిత డైజోఫామ్, ఆల్ఫాజొలం, క్లోరోఫామ్ వంటి మత్తు పదార్థాలను కలిపి అమాయక ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 రోజులలో ముగ్గురు ప్రాణాలు ఈ కల్తీ కల్లుకు బలయ్యాయని అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రెండు సొసైటీ ఆధ్వర్యంలో దాదాపు 12-13 కల్లు డిపోలు నడుస్తున్నాయని దురాశకు పోయి కల్తీ కల్లును ఈ డిపోలు అమ్మడం జరుగుతుందని వీళ్ళు ఇచ్చే మామూళ్లకు ఆశపడి ఎక్సైజ్ శాఖ అధికారులు కల్తీకల్లుపై ఎలాంటి నియంత్రణ చేయకుండా పరోక్షంగా అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారని ఆరోపించారు. గత ఆరు ఏడు సంవత్సరాలుగా ఇక్కడే ఎక్సైజ్ సీఐగా పాతుకపోయినా ఖని ఎక్సైజ్ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఖనిలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఎక్సైజ్ సీఐపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇక్కడ ఉన్న సీఐని సస్పెండ్ చేసి ఇక మీదట కల్తీకల్లు అమ్మకుండా నియంత్రించి అమాయక ప్రజల ప్రాణాలను కాపాడాలని ఉన్నత అధికారులను కోరుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు సాదుల శివ, ఆసాల నవీన్ తో పాటు రేణుకుంట్ల ప్రీతం, రాణవేణి సుధీర్ కుమార్, డబ్బెట గోపికృష్ణ, భూసారపు రాజు , ఎలకపల్లి సురేష్ , వినయ్, కరీం, గౌస్ తదితరులు పాల్గొన్నారు
Admin
Aakanksha News