Thursday, 24 September 2026 03:33:33 PM

మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

Date : 26 August 2023 06:21 PM Views : 705

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : భావితరాలకు ఆహ్లాదకరమైన జీవన విధానం అందించే దిశగా మనమంతా మొక్కలు నాటి వాటి సంరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.శనివారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మంథని మండలంలోని సిరిపురం గ్రామంలోని సంపద వనంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు వేడుకలలో భాగంగా ప్రభుత్వం ఒకేరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు వృక్షార్చన కార్యక్రమం చేపట్టిందని,ఇందులో భాగంగా మన పెద్దపల్లి జిల్లాలో రెండున్నర లక్షల మొక్కలు నాటుతున్నామని కలెక్టర్ అన్నారు.మంథని మండలంలోని సిరిపురం గ్రామంలో పార్వతి బ్యారేజ్ సమీపంలో ఏర్పాటు చేసిన సంపద వనంలో 3 వేలకు పైగా మొక్కలు నాటుతున్నామని, వీటి సంరక్షణ బాధ్యతను అధికారులతో పాటు స్థానికులు కూడా తీసుకోవాలని కలెక్టర్ కోరారు. మన భవిష్యత్తు తరాలు ఆహ్లాదకర జీవనం కొనసాగించేందుకు అభివృద్ధి సంపదతో పాటు మంచి వాతావరణం, కాలుష్యరహిత పర్యావరణం అందించడం చాలా ముఖ్యమని, చెట్ల ద్వారా ప్రాణవాయువు లభిస్తుందని, నేడు పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే భవిష్యత్తులో చెట్లుగా ఎదిగి పర్యావరణ సమతుల్యత పాటించడంలో దోహదపడతాయని కలెక్టర్ అన్నారు.పర్యావరణ సమతుల్యత కోసం, పచ్చదనం పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, సంపద వనాలు పేరుతో పలు కార్యక్రమాలను అమలు చేస్తుందని, ప్రజలు సైతం స్వచ్ఛందంగా మంచి కార్యక్రమంలో పాల్గొని భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి జీవన ప్రమాణాలు అందించే దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపు నిచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ తిరుగు ప్రయాణంలో సిరిపురం గ్రామ సమీపంలో పొలంలో డ్రోన్ సహాయంతో పిచికారి మందు జల్లుతున్న రైతును గమనించి పాటిస్తున్న ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంట దిగుబడి, తదితర అంశాలపై కలెక్టర్ చర్చించారు. ఈ కార్యక్రమంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి వి.హనుమా నాయక్,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య, ఎంపీపీ కొండా శంకర్, జెడ్పిటిసి సుమలత, ప్యాక్స్ చైర్మన్ శ్రీను, రైతుబంధు అధ్యక్షుడు కిరణ్, సర్పంచ్ ప్రసాద్ , మంథని ఎంపీడీవో రమేష్, తహసిల్దార్ రాజయ్య, అటవీ రెంజ్ అధికారి శ్రీనివాసరావు, డిప్యూటీ అటవీ రెంజ్ అధికారి రమేష్ , ఎఫ్.ఎస్. ఓ., ఎఫ్.బి. ఓలు, పిఆర్. ఏఈ అనుదీప్, మండల పంచాయతీ అధికారి ఆరిఫ్, ఏపీఓ సదానందం , ఎస్.హెచ్.జి., ఐ.కె.పి. సభ్యులు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :