ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిధూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీస్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. బీజేపీ ఆఫీస్‌పై కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ నాయకులు ఎదురుతిరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు.కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ తాను గెలిస్తే నియోజకవర్గంలోని రోడ్లను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ చెంపలంతా నునుపుగా మారుస్తానని అన్నారు. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ సహచర ఎంపీని దూషించి ఎలాంటి శిక్ష అనుభవించని వ్యక్తి నుంచి ఇంతకు మించిన ప్రవర్తన ఏం ఆశిస్తామని ప్రశ్నించింది. విమర్శలు పెరగడంతో బిధూరీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.
Admin
Aakanksha News