ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారు మాట్లాడే మాటలు రాజకీయ వర్గాల్లో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పవచ్చు. అయితే తన ఇంట్లో మాజీ సీఎం కెసిఆర్ ఫోటో ఉంటే తప్పేంటని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అభిమానించే వైఎస్సార్, కేసీఆర్ ఫొటోలు తన ఇంట్లో ఉన్నాయని.. వారి ఫోటోలు పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఇటీవల పటానుచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కెసిఆర్ ఫోటో ఉండటంపై స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దానం స్పందిస్తూ.. నాయకుల విషయంలో ఎవరి అభిమానం వారికి ఉంటుందని చెప్పారు. ఇక, హైడ్రా కూల్చివేతలపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే దానం.పేదల ఇళ్లు కూల్చుతా అంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు. హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదని.. అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా తాను సిద్ధమన్నారు.
Admin
Aakanksha News