Friday, 11 July 2025 04:52:37 AM

ఈనెల 13వ తేదీన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న సిఎం రేవంత్ రెడ్డి...

Date : 01 January 2025 07:23 PM Views : 223

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 13వ తేదీన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో క్రీడావిశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఆస్ట్రేలియాలోని క్వీన్‌ల్యాండ్ విశ్వవిద్యాలయాన్ని ఆయన పరిశీలించనున్నారు. సిఎంతో పాటు ప్రభుత్వ సలహాదారుడు జితేందర్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి, ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేశ్ రంజన్, స్పోర్ట్ ఎండి సోనీ బాల, స్పోర్ట్ చైర్మన్ శివసేనా రెడ్డి వెళ్లనున్నారు.

14వ తేదీ నుంచి ఆస్ట్రేలియాలో

సిఎం రేవంత్ రెడ్డి ఈనెల 13వ తేదీ రాత్రి ఆస్ట్రేలియా బయలుదేరి వెళతారు. 14, 15, 16, 17 నాలుగు రోజుల పాటు ఆస్ట్రేలియాలో సిఎం బృందం పర్యటించనుంది. అక్కడ క్వీన్‌ల్యాండ్ విశ్వవిద్యాలయాన్ని ఈ బృందం పరిశీలించనుంది. తిరిగి ఈనెల 18వ తేదీన సింగపూర్‌కు ముఖ్యమంత్రి బృందం అక్కడ షాపింగ్ మాల్‌ను, క్రీడా ప్రాంగణాల నిర్మాణాలను పరిశీలించనుంది. అదే విధంగా సింగపూర్‌లో జరుగనున్న పారిశ్రామికవేత్తల సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొంటారు. అనంతరం 19వ తేదీన సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్ వెళ్లి అక్కడ 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పర్యటించనుంది.

దావోస్‌లో సిఎం రేవంత్ పర్యటన...

దావోస్‌లో 20 నుంచి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ 55వ వార్షిక సదస్సు జరగుతుంది. సిఎంతో పాటు ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు మూడు రోజులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. 2024లో దావోస్ పర్యటన సందర్భంగా సుమారు రూ.40 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు కంపెనీలతో ఒప్పందం చేసుకుంది.ప్రస్తుత పర్యటనలోనూ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ సదస్సులో 50కి పైగా దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలున్న రంగాలను చాటిచెప్పడం ద్వారా విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్ సమావేశాల్లో ‘తెలంగాణ పెవిలియన్’ పేరుతో ప్రత్యేక పెట్టుబడుల సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :