Wednesday, 23 September 2026 11:23:30 AM

గోదావరిఖని కళాకారులకు పలు అవార్డులు

Date : 22 August 2023 05:09 PM Views : 644

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / కరీంనగర్ జిల్లా : గోదావరిఖనికి చెందిన పలువురు కళాకారులు మంగళవారం కరీంనగర్ ఫిలిం భవన్ లో జరిగిన కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడెమీ వార్షికోత్సవ వేడుకల్లో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. ప్రపంచ జానపద కళల దినోత్సవం, కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో మంగళవారం కరీంనగర్ ఫిలిం భవన్ లో సంస్థ వార్షికోత్సవ వేడుకలు, ప్రాచీన జానపద కళారూపాల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ నగర మేయర్ వై. సునీల్ రావు హాజరై మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర గణనీయమైనదన్నారు. పాశ్చాత్య నాగరికత, సంస్కృతి మోజులో కనుమరుగవుతున్న ప్రాచీన జానపద కళారూపాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పలు కళారంగాలలో విశిష్ట సేవలందించిన కళాకారులను శాలువాలతో ఘనంగా సత్కరించి, అవార్డులను ప్రదానం చేసారు. కాగా ఖనికి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యాఖ్యాత, కళాకారుడు మేజిక్ రాజాకు వేదిక వాచస్పతి, కనకం రమణయ్య బృందానికి గద్దర్ గొంగడి రాష్ట్రస్థాయి పురస్కారాలు, ఠాకూర్ ధన్ సింగ్, మామిడి ఐలయ్య, పుల్ల లక్ష్మీనారాయణ, నాగుల శ్రీనివాస్, గద్దల శశిభూషణ్, మాదరి శ్రీనివాస్, కటుకోజ్వల పద్మ వినోద్ తదితరులు గ్రామీణ కళా జ్యోతి అవార్డులు అందుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల అధినేత అనంతరెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు గుండ్ర కృపాదానం, సల్వాజీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కళాకారులు ప్రదర్శించిన ప్రాచీన కళారూపాలు చిరుతల రామాయణం,వీరభద్ర ప్రభలు,డుబ్బులు, పాండవుల కథ విశేషంగా ఆకట్టుకున్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :