ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / వరంగల్ జిల్లా : వరంగల్ లో పదేళ్ల క్రితం ముంపు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని,పేదలకు సొంత ఇళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పిన కేసీఆర్ తన పాలనలో నేటికీ పేదలకు పక్కా గృహాలు అందజేయలేకపోవడం గర్హనీయమని శుక్రవారం స్థానిక బీసీ నాయకులతో కలిసి వరంగల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ ఆరోపించారు..పదేళ్ల క్రితం ముంపు ప్రాంత పేద ప్రజలతో సొంత ఇంట్లో కల్లు గుడాలు యాటతో దావతు చేసుకుందామన్న కేసీఆర్ నేటికీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చక పోవడమే కాక నేడు వరంగల్ తూర్పు ఎమ్మెల్యేతో పేదలు తలదాచుకోవడానికి జక్కలొద్దిలో వేసుకున్న గుడిసెలను అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసుల చేత నిర్మూలించడం, అరెస్టులు చేయించడం,గుడిసె వాసులు తమ పార్టీలోనే చేరాలనడం, తమ జెండాలనే ఎత్తాలంటూ అహంకార పూరితంగా వ్యవహరించడం బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు.. భూకబ్జాలే తప్ప ఎమ్మెల్యే నరేందర్ హయాంలో పేదలకు ఒనగూరిందేమీ లేదన్నారు.. పరిశ్రమలు రాక యువత నిరుద్యోగం బారిన పడి మద్యం, గంజాయికి బానిసలు అయిపోయారని పేర్కొన్నారు.. వరంగల్లో ఏర్పాటు చేస్తామని చెప్పిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు నేటికీ ప్రారంభించకపోవడం ఇక్కడ వాణిజ్య వ్యాపారాలను పెంపొందించడానికి అవసరమైన ఎయిర్పోర్ట్ ను ఏర్పాటు చేయకపోవడం, వరద ముంపు ప్రాంతాలను నేటికీ బాగు చేయకపోవడం, చెరువు శిఖలను కబ్జా చేయడం బీఆర్ఎస్ పార్టీ పనితనానికి నిదర్శనమన్నారు.. వరంగల్ లో బీసీ నాయకత్వాన్ని అణగదొక్కుతున్న ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ స్థానికతపై, సామాజిక నేపథ్యంపై అనేక అనుమానాలున్నాయని దాసు సురేశ్ ఆరోపించారు.. పూర్తివివరాలను త్వరలోనే వరంగల్ ప్రజలకు తెలియజేస్థామన్నారు.. అట్టడుగు వర్గాల సంపూర్ణ అభ్యున్నతే ప్రాతిపదికగా రాజకీయంగా ముందుకు సాగుతామన్నారు..ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య చైతన్య సమితి అధ్యక్షులు ఆకారపు మోహన్, బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు దామర కొండ కొమరయ్య , బిసి నాయకులు సాంబరాజు ప్రభాకర్, పనికెల శ్రీనివాస్,,సంజయ్ చారి , సయ్యద్ యాహుబ్, కమర్ , హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు..
Admin
Aakanksha News