ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన వ్యాపార కూడలి లో రోడ్ల దుస్థితిపై కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించింది. ఈ క్రమంలో నగరంలోని లక్ష్మీ నగర్, కళ్యాణ్ నగర్, శివాజీ నగర్, మేదరి బస్తి తదితర ప్రాంతాల్లో గల వ్యాపార సంస్థల బంద్ కు పిలుపు నిచ్చింది. దీంతో వ్యాపార కూడలిలోని వర్తక వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. 20 సంవత్సరాల క్రితం రామగుండం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్లు శిథిలావస్థకు చేరడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఈ విషయమై కార్పొరేషన్ అధికారులకు, పాలకవర్గానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫలితం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు బంద్ కు పిలుపునిచ్చారు. ప్రధాన కూడళ్ళలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వెంటనే కార్పొరేషన్ అధికారులు స్పందించి రోడ్లను మరమ్మత్తు చేయడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను సరిచేయలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ర్యాలీ సందర్భంగా పోలీసులు కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు పోలీసులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాగ్వివాదం జరిగింది. కాంగ్రెస్ శ్రేణులు పట్టణంలోని వ్యాపార కూడల్లో ర్యాలీ నిర్వహించి వ్యాపారస్తులను బంద్ పాటించాలని వేడుకున్నారు.
Admin
Aakanksha News