ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి జిల్లాలోని ప్రధానంగా మూడు అసెంబ్లీ స్థానాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎదురు గాలీ విస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత గాక పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు తీవ్ర స్థాయిలో చేరినట్లు తెలుస్తుంది. వీటిపై అధిష్టానం వెంటనే దృష్టి పెట్టి సరి చేయకుంటే నష్టం తప్పదనే వాదనలు పలువురి రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తున్నాయి. దీంతో రామగుండంలో రాజకీయ సమీకరణాలు వేగవంతంగా మారుతున్నాయి. నియోజకవర్గంలో విభేదాలు, అసంతృప్తులు, ఆధిపత్య పోరులతో పార్టీ సతమతమవుతుంది. ఇక స్థానిక రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు వ్యతిరేకంగా ఆశావాహులు బాహా... బాహీగానే రోడ్డెక్కి తమ రాజకీయ బలాన్ని నిరూపించుకుంటున్నారు. స్థానిక ఇప్పటికే ఎమ్మెల్యేల పని తీరుపై అధిష్టానం సైతం అసంతృప్తిగా ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకోవాలని నియోజకవర్గంలో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా కొందరి ఎమ్మెల్యేలలో ఏమాత్రం మార్పు రాక పోవడంతో పనితీరులో మరింత వెనుకబడినట్లు అధిష్టానం సర్వేలో వెలుడైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే అధిష్టానం పెద్దపల్లి జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొనసాగిస్తుందా... మార్చుతుందా.. రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండేది ఎవరు అనే చర్చ జోరుగా సాగుతుంది. అయితే నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఆశావాహులు పాలకుర్తి జడ్పిటిసి సభ్యురాలు కందుల సంధ్యారాణి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, రామగుండం తొలి మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాతిపెళ్లి ఎల్లయ్య, బసంత్ నగర్ కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ పర్మినెంట్ కార్మిక సంఘం అధ్యక్షులు మనోహర్ రెడ్డి,లు ఒక్కటిగా ఏర్పడి ఎమ్మెల్యే వైఖరిపై గొంతేత్తడంతో ఈ వివాదం ఆదిష్టానం దృష్టికి వెళ్ళింది. దీంతో అసెంబ్లీ సమావేశాల సమయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆశావాహులతో సమావేశమయ్యారు. అనంతరం వారి నుండి పూర్తి వివరాలను సేకరించారు. దీంతో మంత్రి కేటీఆర్ సర్వేల ఆధారంగా రామగుండం నియోజకవర్గంలో టిక్కెట్ కేటాయిస్తామని ఎవరు పార్టీకి వ్యతిరేకంగా పనులు చేయవద్దని పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. దీంతో పాటు మంత్రి కేటీఆర్ నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతలను మంత్రి కొప్పుల ఈశ్వర్ కు అప్పగించారు. దీంతో మంత్రి కొప్పుల ఈశ్వర్ తో సమావేశం కావడానికి ఆశావాహులు కరీంనగర్ కు వెళ్లిన సమయంలో అనూహ్యంగా అక్కడికి చేరుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆశావాహులతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు వారు సుముఖం చూపలేదనే ప్రచారం జరుగుతుంది. నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం గోదావరిఖనిలో ఆశావాహులతో కలసి పార్టీ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంది. అయితే ఆశావాహులపై ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన అనుచరులతో అమ్ముడుపోయారని, కలసిపోయారని ఆశావాహులపై తప్పుడు ప్రచారం చేయించడంపై వారు ఆ సహనం వ్యక్తం చేస్తూ మంత్రి సమక్షంలో నిర్వహించే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రామగుండం రాజకీయం మరోసారి వేడెక్కింది. ఇప్పటికే అధిష్టానానికి పెద్దపెల్లి జిల్లా తలనొప్పిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ నియోజకవర్గంలో లేని సమస్యలు, అసంతృప్తుల గొడవ, వ్యతిరేకత రామగుండం నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో అధిష్టానం దృష్టంతా రామగుండం నియోజకవర్గం వైపె ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే స్థానిక ఎమ్మెల్యే కొరుకంటి చందర్ కు మరో కొత్త తలనొప్పి వచ్చి పడినట్లు సమాచారం. ఆదివారం జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీసీ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి కొంతమంది కార్పొరేటర్లు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. కార్పొరేటర్ల ఫోరం సభ్యులు బీసీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి దూరంగా ఉండటం రామగుండం నియోజకవర్గంలో మరో రాజకీయ వివాదానికి దారి తీసింది. తమ డివిజన్ లో తమకు తెలియకుండా తమ ప్రమేయం లేకుండా ఇతరులు పెత్తనం చేయడం, కార్పొరేటర్లకు కనీస విలువ ఇవ్వకపోవడం, వంటి సమస్యలతో ఈ చెక్కుల పంపిణీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. రామగుండం నియోజకవర్గంలో ఒకవైపు ఆశావాహులు, మరోవైపు కార్పొరేటర్ల ఫోరం సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేయడంతో మరోసారి ఈ రాజకీయ దుమారం అధిష్టానం వద్దకు చేరే అవకాశాలు ఉన్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా రామగుండం నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న రాజకీయ విభేదాలు అంతర్గత కారణాలతో రోడ్డుకిక్కడంతో తెలంగాణ రాష్ట్రంలో రామగుండం నియోజకవర్గం ఒక సమస్యగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అధిష్టానం సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలు అధిష్టానం దృష్టికి వెళ్తే రాజకీయ సమీకరణాలు ఎటువైపు దారితీస్తాయో అనే ఆందోళన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏది ఏమైనా రానున్న రోజుల్లో రామగుండం రాజకీయ పరిస్థితి ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.
Admin
Aakanksha News