ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక ప్రయోగం చేపట్టబోతున్నది. ఈ నెల 30న రాత్రి 9.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్‌ని నింగిలోకి పంపనున్నది. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లోని తొలి ప్రయోగ వేదిక నుంచి ప్రయోగం చేపట్టనున్నది. ఈ రాకెట్ ద్వారా 400 కిలోల బరువుతో రూపొందించిన స్పాడెక్స్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జంట ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యలో ప్రవేశపెట్టబోతున్నది. ఈ నెల 5న ఇస్రో విజయవంతంగా ప్రోబా-3 మిషన్‌ని విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయవంతమైన ప్రయోగం తర్వాత, ఇస్రో ప్రస్తుతం పీఎస్ఎల్వీ సీ-60 ప్రయోగానికి పూర్తి స్థాయి సిద్ధమైంది.ప్రయోగంలో భాగంగా రాకెట్ అనుసంధాన పనులను ఇస్రో పూర్తి చేసింది. పీఎస్ఎల్వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ బిల్డింగ్‌లో అనుసంధాన పనులు పూర్తి చేసుకున్న రాకెట్‌ని షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. ప్రయోగ వేదిక వద్దనున్న మొబైల్ సర్వీస్ టవర్కి తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రాకెట్ ఎంఎస్టీ వద్దకు చేర్చారు. రాకెట్ శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చి ప్రయోగానికి సిద్ధం చేయనున్నారు. సాధారణంగా పిఫ్ భవనంలో రాకెట్ రెండు దశల వరకు అనుసంధానం చేసి ఎంఎస్టీకి తరలిస్తారు. అక్కడే మూడు, నాలుగు దశలను అనుసంధానం చేసి ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియను పూర్తి చేస్తారు. తొలిసారిగా పిఫ్ భవనంలోనే పీఎస్ఎల్వీ సీ-60 నాలుగు దశలను అనుసంధానం చేశారు. రాకెట్ సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాక ప్రయోగం కోసం కౌంట్ డౌన్ ప్రారంభిస్తారు.అంతరిక్షంలో స్పేస్ షెటిల్ డాకింగ్ చేసేందుకు, అన్ డాకింగ్ చేసేందుకు అవసరమైన సాంకేతికను అభివృద్ధి చేయడం ఈ మిషన్ లక్ష్యం. పీఎస్ఎల్వీ ద్వారా రెండు చిన్న వ్యోమనౌకలను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్‌ని చేసేందుకు స్పాడెక్స్ మిషన్ ఖర్చుతో కూడుకున్న సాంకేతిక ప్రదర్శన మిషన్ అని ఇస్రో పేర్కొంది. చంద్రుడి నమూనాలను తీసుకురావడం, భారత్ అంతరిక్ష కేంద్రం నిర్మాణం తదితర లక్ష్యాలకు ఈ సాంకేతికత చాలా అవసరమని ఇస్రో తెలిపింది. మిషన్ విజయవంతమైతే.. స్పేస్ డాకింగ్ టెక్నాలజీ కలిగి ఉన్న ప్రపంచంలోని నాలుగో దేశంగా భారత్ అవతరించనున్నది.ఈ నెల 9న ప్రోబా-3 మిషన్ విజయవంతమైన తర్వాత ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ మాట్లాడారు. త్వరలోనే స్పాడెక్స్ అనే స్పేస్డాకింగ్ ప్రయోగం నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ప్రయోగానికి రాకెట్ సిద్ధంగా ఉందని.. ప్రయోగం చివరి దశలో ఉన్నామని.. డిసెంబర్‌లోనే ప్రయోగం చేపట్టవచ్చని చెప్పారు. ఈ మిషన్లో రెండు చిన్న వ్యోమనౌకలు (ఒక్కొక్కటి 220 కిలోల బరువు) ఉంటాయి. ఈ రెండింటిలో ఏకకాలంలో ఇస్రో నింగిలోకి పంపి.. 470 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో 55 డిగ్రీల వంపుతో కక్ష్యలో ప్రవేశపెడుతుంది. ఇక ఇస్రోకు ఈ ఏడాది ఇదే ఆఖరి మిషన్ కావడం విశేషం. రాబోయే రోజుల్లో పలు కీలక ప్రయోగాలు చేపట్టబోతున్నది.
Admin
Aakanksha News