Saturday, 07 December 2024 01:39:55 PM

ప్రజా ప్రభుత్వ విజయాలను చాటి చెప్పేందుకే విజయోత్సవాల నిర్వహణ...

రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి శ్రీధర్ బాబు

Date : 27 November 2024 06:00 AM Views : 44

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మంథని : రాష్ట్రంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం గత సంవత్సర కాలంలో సాధించిన విజయాలను చాటి చెప్పే దిశగా విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మాత్యులు డి.శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని శివ కిరణ్ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత సంవత్సరం డిసెంబర్ 7న ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. పేదలకు ఇచ్చిన మాట ప్రకారం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల కే గ్యాస్ సిలిండర్ సరఫరా, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు కార్పొరేట్ ఆసుపత్రులో ఉచిత వైద్యం వంటి పథకాలను అమలు చేస్తున్నందుకు విజయోత్సవాలు జరుపుతున్నామని మంత్రి తెలిపారు. గత పది సంవత్సరాలలో ఉద్యోగాలు లేక చాలా కష్టాలు పడ్డ నిరుద్యోగ యువతకు 10 నెలల కాలంలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసినందుకు విజయోత్సవాలు ఘనంగా చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థులు ఒకే చోట చదువుకునే విధంగా అడవి సోమనపల్లి ప్రాంతంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల నిర్మాణ పనులు చేపట్టామని మంత్రి గుర్తు చేశారు. రెండు లక్షల వరకు రుణాలు ఉన్న 22 లక్షల మంది రైతులకు రూ. 18 వేల కోట్ల రుణ మాఫీ పూర్తి చేశామని, సన్న రకం వడ్లకు రూ. 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని, మన పెద్దపల్లి జిల్లాలో బోనస్ కింద ఇప్పటివరకు రూ. 20 కోట్లకు పైగా రైతుల ఖాతాలలో జమ చేశామని అన్నారు. గతంలో తరుగు పేరిట రైతులు పడిన బాధలను శాశ్వతంగా పరిష్కరిస్తూ మద్దతు ధరపై ఎటువంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 17వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి 236 కోట్లు వారి ఖాతాలలో జమ చేశామన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా గుట్ట లకు, రోడ్లకు కాకుండా అసలైన రైతులకు, కౌలు రైతులకు లబ్ధి చేకూర్చేలా త్వరలో రైతు భరోసా పథకం అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ‌ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంథని లో స్పష్టమైన మార్పు కనిపించే విధంగా రాబోయే నాలుగు సంవత్సరాలు పని చేస్తానన్నారు. వాణిజ్య వ్యాపారాలు విస్తరించే విధంగా మంథని మంచిర్యాల ను కలుపుతూ గోదావరి నది పై బ్రిడ్జి నిర్మాణానికి రూ. 120 కోట్లు మంజూరు చేసామని టెండర్ల తదుపరి పనులు ప్రారంభం కానున్నాయన్నారు. మంథని పట్టణానికి బైపాస్ రోడ్డు, 13 వార్డులలో సిమెంట్ రోడ్డులు డ్రైనేజీ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మంథని పట్టణంలో 40 మంది యువకులకు ఉపాధి కల్పిస్తూ చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. రామగిరి క్షేత్రాన్ని రూ. 5 కోట్లతో అభివృద్ధి చేస్తామని, మంథని పట్టణం సమీపంలో గల గోదావరి నది తీరంలో రెండు కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. మంథని పట్టణ సమీపంలో 150 మంది మహిళ సంఘాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతూ చిన్న ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని, దీనికి అరమైన స్థలాలను ఎంపిక చేయాల్సిందిగా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. బహుళ జాతి కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు మన యువతకు అందించే దిశగా నైపుణ్య కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని, వీటి ద్వారా యువకులకు మంచి శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ పథకం ద్వారా మొదటి విడతలో భూమి ఉండి, ఇండ్లు లేని వారిని ఎంపిక చేసి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని, భూమిలేని వారికి భవిష్యత్తులో అనువైన భూమిని ఎంపిక చేసి పేదలకు ఇండ్లు నిర్మిస్తామన్నారు. మంథని పట్టణంలో అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాల నిర్మాణం చేస్తామని అన్నారు. ఐ.సి.డి.ఎస్ ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేపించి, విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ రమాదేవి, వైస్ చైర్మన్, బానయ్య సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2024. All right Reserved.

Developed By :