Wednesday, 23 September 2026 05:31:14 AM

మద్దతు ధరపై 400 రూపాయల బోనస్‌ ఇచ్చి కంది రైతులను ఆదుకోవాలి...

సీఎం రేవంత్‌ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ

Date : 29 December 2024 05:40 AM Views : 581

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : రాష్ట్రంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరపై 400 రూపాయల బోనస్‌ ఇచ్చి కంది రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు.రాష్ట్రంలో సుమారు 6 లక్షల ఎకరాల్లో 2.5లక్షల మెట్రిక్‌ టన్నుల కందులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో, వరంగల్ రైతు డిక్లరేషన్‌లో భాగంగా కందులకు మద్దతు ధరతో పాటు అదనంగా 400 రూపాయల బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చి రైతులను నమ్మించారని అన్నారు. కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బహిరంగ మార్కెట్‌లో రైతులు కనీస మద్దతు ధర పొందే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.కందులకు మద్దతు ధర 7,550 ఉంది కానీ బహిరంగ మార్కెట్‌లో 6500 నుంచి 6800 మించి క్వింటాలుకు చెల్లింపు జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. ప్రతి క్వింటాలు పైన మద్దతు ధరతో పోలిస్తే రైతులు 800 రూపాయలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రైతులు మరింత నష్టపోయే అవకాశం ఉన్నట్టు కనిపిస్తున్నదని అన్నారు.కాబట్టి వెంటనే ప్రభుత్వం కంది రైతుల పట్ల నిర్లక్ష్యం వీడి.. వారి గోస తీర్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరారు. అలాగే రైతులకు మద్దతు ధర అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా వరంగల్ రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మద్దతు ధరపై 400 రూపాయల బోనస్ కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :