ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మంథని : ప్రభుత్వ జూనియర్ కళాశాల మంథని లో విద్యార్థులకు గంజాయి, మత్తుపదార్థాల వినియోగం వలన కలుగు నష్టాలపై, సైబర్ క్రైమ్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంథని సీఐ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ కాలంలో సెల్ ఫోన్ వినియోగం పెరిగిపోయిందని, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్ట్, ఆధార్ కార్డు, పెన్షన్, పౌరసరఫరాల వినియోగానికి సంబంధించి అన్ని విధాలుగా సెల్ ఫోన్ నెంబర్ అవసరం ఉంటుందని, దాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మనకు ఏదో లేనిపోని ఆశలు చూపించి అదేవిదంగా కొత్తగా పెళ్లి కార్డ్స్ APK ఫైల్స్, డిజిటల్ అరెస్ట్ అని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో మహిళలు పిల్లలను టార్గెట్ చేసుకొని సైబర్ నేరాలు పెరుగుతున్నాయని యువత ఇంటర్నెట్ పరిమితికి మించి వాడకూడదని, సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి డబ్బులను కాజేస్తున్నారన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి మీ ఏటీఎం, పిన్ నెంబర్ , సీవీవీ, బ్యాంకు ఖాతా తదితర వివరాలు కోరితే ఇవ్వరాదని, ఎవరైనా మీకు లాటరీ తగిలింది, కొంత డబ్బును సూచించిన బ్యాంకు ఖాతాలో జమచేయాలని ఫోన్ కాల్ వచ్చినా, ఏ విధంగా అయినా మీరు మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బును కోల్పోతే వెంటనే సమీప పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎలాంటి ఆపద సమయంలో సైబర్ నేరాల పట్ల https://www.cybercrime.gov.in కి గాని టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి లేదా 100 కు ఫోన్ చేసి పోలీసుల సేవలు పొందాలని కొరారు. కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం చేడు అలవాట్లకు బానిసలుగా మారి భవిష్యత్తు నాశనం చేసుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్థి దశ నుండి క్రమశిక్షణ తో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో జీవించాలి అని తల్లితండ్రుల ఆశలు నెరవేర్చి అధ్యాపకులకు, కళాశాలకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల, ర్యాగింగ్, సైబర్ క్రైమ్, మత్తు పదార్థాలు డ్రగ్స్ వంటి తదితర అంశాల పై యువత, విద్యార్థునులకు పూర్తిగా అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మంథని ఎస్సై సత్యనారాయణ కళాశాల అధ్యాపక సిబ్బంది, మంథని పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News