ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / ఖమ్మం జిల్లా : తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్ మెంట్‌ను పూర్తిగా పక్కకు పెట్టిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తప్పులు దొర్లకుండా నిజమైన ఇందిరమ్మ లబ్ధి దారులను ఎంపిక చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జిల్లాకో స్పెషల్ ఆఫీసర్‌ను నియమించామని గుర్తుచేశారు. మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తామని వివరించారు. ఇవాళ(మంగళవారం) ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ సచివాలయంలో అధికారులతో కీలక భేటీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక సర్వేపై అధికారులతో చర్చించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో 33 జిల్లాల నుంచి ప్రాజెక్ట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19,000 మంది సిబ్బందితో యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని గుర్తుచేశారు. దరఖాస్తుల ఆధారంగా ఇంటింటికీ వెళ్లి సర్వే పూర్తి చేసినట్లు వివరించారు. నిన్నటి వరకు 30 లక్షల పైచిలుకు అప్లికేషన్ల సర్వే పూర్తి అయినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.ఈసందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... 80 లక్షల మంది ఇందిరమ్మఇళ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారని చెప్పారు. ఇందిరమ్మ యాప్‌ను ఏర్పాటు చేసి లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా వినియోగిస్తామని అన్నారు. ఇందిరమ్మఇళ్ల కోసం ప్రత్యేక డిజైన్ అంటూ ప్రభుత్వం ఏం నిర్ణయించలేదని చెప్పారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు నిర్మించుకోవచ్చని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం ఒక్క అడుగు వెనక్కి వేయదని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఉండొద్దని చెప్పారు. రాబోయే రెండు రోజుల్లో ఒక వెబ్ సైట్‌ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.టోల్ ఫ్రీ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏమైనా అనుమానాలు ఉంటే వెబ్ సైట్‌లో నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు స్టీల్, సిమెంట్, ఇసుకపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. ఇళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి కేసీఆర్ ప్రభుత్వానికి లేదని అన్నారు. పేదవాడు అయితే పింక్ షర్ట్ వేసుకున్నా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పారదర్శకంగా ఉండేందుకు విజిలెన్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
Admin
Aakanksha News