ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీలను ఆప్రజాస్వామికంగా సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ధర్నాలో రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.ఈ మేరకు రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ... పార్లమెంటుపై అగంతకులు చేసిన దాడి పట్ల సభలో చర్చించాలని అడిగిన ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులను ఆ ప్రజాస్వామికంగా సస్పెన్షన్ చేయడాన్ని ఖండించారు.భారత పార్లమెంటు పైన దాడి అంటే ప్రజాస్వామ్యం రాజ్యాంగం పైన జరిగిన దాడిగా భావించాలని అన్నారు.పార్లమెంట్ పై జరిగిన దాడితో ప్రపంచ దేశాల్లో భారత దేశ విలువ ఎంత దిగజారిందో దేశ ప్రజలు ఆలోచన చేయాలని పేర్కొన్నారు.దేశ చరిత్రలో కనీ విని ఎరగని విధంగా పార్లమెంటు సభ్యులను 141 మందిని సస్పెండ్ చేయడం దుర్మార్గం అని అన్నారు.ప్రశ్నిస్తే కేసులు, పార్లమెంట్ నుంచి బహిష్కరణ స్వేచ్ఛ, భావ ప్రకటన లేకుండా నియంత్రత్వ పోకడలతో మోడీ పాలన సాగుతుందని అనడానికి ఎంపీల సస్పెన్షనే నిదర్శనం అని విమర్శించారు.కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లు రోడ్లపైకి వచ్చి ఈ దేశం కోసం మేము ఉన్నాం. మీకోసం నిలబడతామని బాసటగా నిలుస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో దేశభక్తులు, ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయవాదులు పాల్గొనాలని కోరారు.
Admin
Aakanksha News