ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : దేశ జీడీపీలో బొగ్గు, గనుల రంగం భాగస్వామ్యం 2 శాతం అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు.ఒడిశాలోని చారిత్రక ప్రాంతమైన కోణార్క్ లో.. రాష్ట్రాల బొగ్గు,గనుల శాఖ మంత్రుల జాతీయ సదస్సులో జి.కిషన్ రెడ్డి ప్రసంగించారు.పారిశ్రామిక అభివద్ధి, మౌలిక సదుపాయాలు, ఆటోమొబైల్, పునరుత్పాదక విద్యుత్, ఆధునిక సాంకేతికత, తయారీ రంగం వంటి వివిధ రంగాల్లో బొగ్గుతోపాటు వివిధ ఖనిజాలు పోషించే పాత్ర అత్యంత కీలకం అని అన్నారు.గనుల రంగం లేకుండా దేశ ఆర్థిక కార్యకలాపాలు దాదాపు అసాధ్యమని చెప్పొచ్చు. ప్రస్తుతం దేశంలోని72 శాతం విద్యుదుత్పత్తి బొగ్గు ద్వారానే జరుగుతోంది.దేశంలో ఆర్థిక కార్యకలాపాలు, పారిశ్రామికీకరణ వేగంగా పెరుగుతోంది. దీనికి అనుగుణంగా విద్యుత్ అవసరాలు కూడా పెరుగుతున్నాయి. అందుకే డిమాండ్లకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది.దేశంలో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి మొత్తం విలువ దాదాపు 1.86 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. 2024లో 997 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. 2014తో పోల్చుకుంటే ఏకంగా 76శాతం మేర ఉత్పత్తి పెరిగింది. 2030 నాటికి 1.5 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. రాష్ర్ట ప్రభుత్వాల సహకారంతో ఈ లక్ష్యాన్ని చేరుకోగలుగుతామనే విశ్వాసం మాకుంది.అదేవిధంగా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా ఎలక్ట్రానిక్ వాహనాలు, క్లీన్ టెక్నాలజీ కోసం లిథియం, కోబాల్ట్, కాపర్ వంటి ఖనిజాలకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే బొగ్గు, మరియు గనుల రంగంలో భారత ఆత్మ నిర్భరత సాధించడం మనకు అత్యంత అవసరం.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో 10 ఏళ్లుగా బొగ్గు, గనుల రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం.2015 కన్నా ముందు బొగ్గు మరియు గనుల రంగం తీవ్ర సంక్షోభంలో ఉండేది. గనుల కేటాయింపులో న్యాయపరమైన సమస్యలు ఉండేవి. ప్రభుత్వానికి ఆదాయం కూడా సరిగ్గా ఉండేది కాదు. లీజు రెన్యూవల్స్ విషయంలో కూడా జాప్యం జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 10 ఏళ్లలో ఈ రంగాన్ని పూర్తిగా సంస్కరించాం. దీని కారణంగా.. ఇవాళ బొగ్గు గనుల రంగం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక రంగంగా మారిపోయింది. ఎంఎండీఆర్ (మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్‌మెంట్ యాక్ట్) చట్టంలో సవరణలు తీసుకొచ్చాం. MMDR చట్టం గనుల రంగానికి సరికొత్త దిశను చూపెట్టింది. దీంతో మైనింగ్ రంగ ప్రగతి పరుగులు పెడుతోంది. ఈ పురోగతిలో ప్రైవేటు రంగాన్ని కూడా భాగస్వామ్యం చేశాం.వేలం వ్యవస్థను తీసుకురావడం వల్ల గనుల రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం వచ్చింది. ఇప్పటివరకు దాదాపు 442 బ్లాకులకు వేలం జరిగింది.ఈ సంస్కరణల కారణంగా రాష్ర్ట ప్రభుత్వాలకు అదనపు ఆదాయం వస్తోంది.2015 నుంచి ఇప్పటివరకు వేలం (ఆక్షన్ ప్రీమియం) ప్రీమియం, రాయల్టీ రూపంలో దాదాపు 2.69 లక్షల కోట్లు రాష్ర్ట ప్రభుత్వాల ఖజానాకు వెళ్లాయి.అదే 2004-2014 మధ్య కాలంలో.. రాష్ట్ర ప్రభుత్వాలకు సమకూరిన ఆదాయం రూ. 55,636 కోట్లు మాత్రమే.ఇదే కాకుండా గనుల పరిసరాల్లో ఉండే వారి సంక్షేమం కోసం 2015లో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (డీఎంఎఫ్) పేరిట ఇప్పటివరకు లక్ష కోట్ల రూపాయలకు పైగా డబ్బు జమ చేశాం. బొగ్గు ఉత్పత్తయ్యే రాష్ట్రాలకు రూ.31 వేల కోట్లు షేర్ చేశాం. నేషనల్ మినరల్ ఎక్స్ ప్లోరేషన్ ట్రస్టు ద్వారా 23 రాష్ట్రాల గనులు మరియు జియాలజీ విభాగాలను మరింత పటిష్టం చేసేందుకు రూ.90 కోట్లు సాయం చేశాం. అలాగే రూ.40 కోట్లు గ్రాంట్ల రూపంలో కూడా ఇచ్చాం. గనుల రంగంలో స్వయం సమృద్ధి తీసుకొచ్చేందుకు ఎంఎండీఆర్ లో చాలా సంస్కరణలు తీసుకొచ్చింది.అదేవిధంగా క్యాప్టివ్ గనులు, మర్చంట్ గనుల మధ్య విబేధాలు తొలగించాలి. క్లియరెన్స్ ట్రాన్స్ ఫర్, మినరల్ కన్సెషన్ ట్రాన్స్ ఫర్ విషయంలో ఆంక్షలు ఎత్తేయాలి.ఈ సంస్కరణలన్నీ పకడ్బందీగా అమలు చేసేందుకు, మరీ ముఖ్యంగా వేలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు చాలా ముఖ్యం.మినరల్ బ్లాకుల వేలం విషయంలో కొన్ని రాష్ట్రాలు చాలా బాగా పనిచేస్తున్నాయి.అయితే కొన్ని రాష్ట్రాల్లో తక్కువ వేలం జరుగుతోంది. మరికొన్ని రాష్ట్రాల్లో అస్సలు జరగట్లేదు.జీఎస్ఐ ఇచ్చిన నివేదికలపై రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.ఇక, బ్లాకుల తవ్వకాలు ప్రారంభమై పనులు జరిగితేనే వేలం వ్యవస్థ యొక్క ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇదంతా జరగాలంటే భూసేకరణ, పర్యావరణ, అటవీ అనుమతులు అలాగే లైసెన్స్ జారీ ప్రక్రియను రాష్ర్ట ప్రభుత్వాలు వేగవంతం చేయాలని కోరుతున్నాను. సింగిల్ విండో వ్యవస్థ ద్వారా అనుమతులు జారీ చేయాలి.కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయడం చాలా అవసరం. మరో విషయమేంటంటే క్రిటికల్ మినరల్స్ రంగంలొ ఈ రోజున భారతదేశం అంతర్జాతీయంగా పోటీ పడుతోంది.2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను, 2070 నాటికి నెట్ జీరో కమిట్ మెంట్ ను పూర్తిచేసేందుకు క్రిటికల్ మినరల్స్ రంగలో స్వయం సమృద్ధి సాధించడం చాలా కీలకం. తక్కువ సమయంలోనే..మేం 48 క్రిటికల్ మినరల్ బ్లాక్స్ కోసం వేలం పాటను ప్రారంభించాం. ఇందులో 24 బ్లాక్స్ కు వేలం విజయవంతంగా పూర్తయింది.ఇప్పుడు ఐదో దశ వేలం ప్రారంభం కానుంది. అన్ని విడతల వేలంలోనూ మొత్తం ఇండస్ట్రీ ఉత్సాహంగా పాలుపంచుకుంది. రానున్న రోజుల్లోనూ ఈ ఉత్సాహాన్ని కొనసాగించాలి. దీంతోపాటుగా క్రిటికల్ మినరల్ మిషన్ ను కూడా త్వరలోనే ప్రారంభించు కోబోతున్నాం. ఆ తర్వాత దేశీయంగా.. ఉత్పత్తి, రీసైక్లింగ్, విదేశాల్లో మినరల్ బ్లాక్స్ తీసుకోవడం వంటి అంశాలపై దృష్టి పెడతాం.దీంతోపాటుగా OAMDR Act (ఆఫ్ షోర్ ఏరియాస్ మినరల్ డెవలప్ మెంట్ యాక్ట్) లో సవరణలు తీసుకొచ్చాం. తద్వారా భారతదేశంలో తొలిసారి ఆఫ్ షోర్ బ్లాక్స్ ల వేలాన్ని నిర్వహించాం. ఖనిజ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా అనేక సంస్కరణలు చేపట్టాం.ఇటీవల రియాద్ లో ఫ్యూచర్ మినరల్స్ ఫోరమ్ - 2025 ఇతివృత్తంతో జరిగిన అంతర్జాతీయ సదస్సులో.. వివిధ దేశాల బొగ్గు, గనుల శాఖ మంత్రులందరూ కలిసి.. వాతావరణంలో సానుకూల మార్పులకోసం సుస్థిర మైనింగ్ అవసరంపై ప్రత్యేకంగా మాట్లాడారు.ఈ సమావేశంలో భారతదేశ ప్రతినిధిగా నేను పాల్గొన్నాను. ఇందులో.. గనుల్లో భద్రతతోపాటుగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటోమేషన్, మెషీన్ లర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతను మన దేశంలో వినియోగిస్తున్న తీరును వివరించాను.భారతీయ గనుల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆహ్వానించాను. దీంతోపాటుగా క్రిటికల్ మినరల్స్ కు సంబంధించిన సుస్థిరమైన సప్లయ్ చైన్ నిర్మాణంపై ఈ సమావేశంలో నేను ప్రత్యేకంగా మాట్లాడాను.రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో త్వరలోనే భారతదేశం క్రిటికల్ మినరల్స్ రంగంలో ఓ గ్లోబల్ డెస్టినేషన్ గా మారుతుందనే విశ్వాసం నాకుంది. దీంతోపాటుగా బొగ్గు ఉత్పత్తిని కూడా మనం ప్రాధాన్యతాంశంగా గుర్తించాలి.ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బొగ్గు వినియోగం మెల్లిమెల్లిగా స్థిరత్వాన్ని చేరుకుంటోంది. కానీ భారతదేశంలో మాత్రం 2040 నాటికి బొగ్గు వినియోగం మరింతగా పెరగనుంది. మనకు ఏడాదికి దాదాపుగా 2 బిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంది. ఈ డిమాండ్ ను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వా సహకారం చాలా అవసరం.దీంతోపాటుగా.. బొగ్గు, గనుల రంగంలో సుస్థిరత్వాన్ని చేరుకునేందుకు వివిధ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.ప్రస్తుతం భారతదేశంలో పునరుత్పాదక విద్యుత్ (రెన్యూవబుల్ ఎనర్జీ) సామర్థ్యం 200 గిగావాట్లు మాత్రమే. 2030 నాటికి దీన్ని 500 గిగావాట్లకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం పనిచేస్తోంది. ఇందులో బొగ్గు, గనుల రంగం కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉంది.ఈ దిశగా 2030 నాటికి 15.5 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని బొగ్గు రంగం లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తోంది.ప్రస్తుతం భారతదేశంలో.. 2500 హెక్టార్లమేర డీకోల్డ్ ల్యాండ్ (తవ్వకాలు పూర్తయిన బొగ్గు గనులు)పై సోలార్ పవర్, పంప్ స్టోరేజ్ ప్లాంట్స్ ఏర్పాటవుతున్నాయి. ఇలాగే అన్ని డీకోల్డ్ ల్యాండ్స్ పైన సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరం ఉంది.దీంతోపాటుగా.. రూ,8,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ వ్యవస్థను ప్రారంభించాం. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేసే లక్ష్యంతో పనిచేస్తున్నాం.దీంతోపాటుగా తవ్వకాలు పూర్తయిన గనుల మూసివేత (మైన్ క్లోజర్)పైనా ప్రత్యేక దృష్టిసారించాం. ఇందుకోసం మనమంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో స్థానికులను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేస్తూ.. ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో బొగ్గు, గనుల రంగంలో ఎదురవుతున్న సవాళ్లను కూడా పరిష్కరించేందుకు ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సి అవసరం ఉంది. దీంతోపాటుగా సంబంధిత పథకాలన్నింటినీ సమర్థవంతంగా అమలుచేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల సంపూర్ణ సహకారాన్ని కోరుతున్నాను. District Mineral Foundation (DMF) Trust నిధులను సద్వినియోగం చేసుకోవడంపైనా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలి. సరైన అవసరాలకోసమే ఈ నిధుల వినియోగం జరగాలి. బొగ్గు రంగంలో దాదాపు 5 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతోంది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలను మరింతగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య నిర్మాణం పెంచడం వంటివాటిపై దృష్టిసారించాలి. దీంతోపాటుగా ఎక్స్‌ప్లొరేషన్స్ (తవ్వకాలు)పెంచేందుకు నేషనల్ మినలర్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్ కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు NMET ద్వారా 329 ప్రాజెక్ట్స్ కు ఫండింగ్ చేశాం.అన్ని రాష్ట్రాలు NMET ద్వారా ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలి. దీంతోపాటుగా.. రాష్ట్రాల మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్ లను ఏర్పాటు చేసుకోవాలి. దేశంలో అక్రమ మైనింగ్ ఓ పెద్ద సమస్యగా మారింది. అత్యాధునిక సాంకేతికత సహయాంతో దీనికి అడ్డుకట్ట వేయాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభత్వాల సహకారం అవసరం. ఈ దిశగా.. కేంద్ర ప్రభుత్వం 2016లో ‘మైనింగ్ సర్వేలెన్స్ సిస్టమ్’ ను తీసుకొచ్చింది. దీని ద్వారా అసాధారణ కార్యక్రమాలు ఏం జరిగినా వెంటనే హెచ్చరికలు జారీ అవుతాయి.రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేసినపుడే.. మనం అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు వీలుంటుంది. అందుకోసం.. వీలైనంత ఎక్కువగా గనుల వేలం నిర్వహించాలి, సరైన సమయంలో గనుల్లో తవ్వకాల పనులు ప్రారంభం కావాలి. దీంతోపాటుగా సుస్థిర గనుల తవ్వకాల పద్ధతులను పాటించాలి. తవ్వకాలు పూర్తయిన గనులను వీలైనంత త్వరగా మూసేయడంపై దృష్టిసారించాలి. గనుల్లో కార్మికుల భద్రత, వారి సంక్షేమంపై నిరంతరం దృష్టి సారించాలి. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ధి, కార్మికుల సంక్షేమం కేంద్రంగా ఓ సర్వఆమోద యోగ్యమైన మోడల్ తయారు చేసుకుని ముందుకెళ్తాం. రానున్న తరాలకోసం ఓ ఆదర్శవంతమైన విధానాన్ని తీసుకొద్దామన్నారు.
Admin
Aakanksha News