ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి పార్టీ శ్రేణులతో కలిసి ఈరోజు గోదావరిఖని పట్టణానికి సమీపంలో ఉన్న యైటింక్లైన్ కాలనీలో పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వివిధ డివిజన్లలో భారీ ర్యాలీ నిర్వహించి, ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ అవినీతి నాయకులను అంతం చేయాలని ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో సంధ్యారాణి మాట్లాడుతూ... ఇల్లు వాకిలి కుటుంబాన్ని వదిలేసి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్నానని, తనను ఆదరించాలని కోరారు. అవినీతి నాయకులను ఎదిరించే తనకు ఎమ్మెల్యే గా అవకాశం కల్పించాలన్నారు. నయీమ్, రౌడీల మాదిరిగా ఇక్కడున్న ప్రధాన పార్టీ నేతలు తలపిస్తున్నారని, తనపై కుట్ర జరుగుతుందని అన్నారు. సహించలేని కొందరు తన ప్రచార రథాలపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి బీఆర్ఎస్ పార్టీలో కష్టపడితే తనకు అవకాశం దక్కలేదని బిజెపి పార్టీ ఆదరించిందని పేర్కొన్నారు. ఇదే క్రమంలో మీ ఆడబిడ్డగా అవకాశం ఇచ్చి, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలని పేర్కొన్నారు. తాను గెలిచిన వెంటనే ఆరు మాసాలలో స్మార్ట్ సిటీ చేస్తానని... లేదంటే రాజీనామా చేస్తానని పేర్కొన్నారు.
Admin
Aakanksha News