ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఏఐటీయూసీ న్యాయ పోరాటం వల్లనే ప్రభుత్వం, యాజమాన్యం సింగరేణిలో ఎన్నికలు నిర్వహిస్తుందని వాయిదాలు వేయించిన సంఘాలు ఓట్లేలా అడుగుతారని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శి కే.స్వామి, బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం లు ప్రశ్నించారు. మంగళవారం సింగరేణి ఆర్జీ-1 ఏరియాలోని జీడీకే 11వ ఇంక్లైన్ లో ప్రి-షిఫ్ట్ మొదలు ఉదయం 9 గంటల వరకు మూడు షిఫ్టుల్లో జరిగిన గేట్ మీటింగ్ లలో వారు పాల్గొని మాట్లాడుతూ.. 2017 అక్టోబర్ 5 న 6వ సారి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 6 సంవత్సరాలు గడిచినా అటు ప్రభుత్వం ఇటు యజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లుండి వాయిదాల మీద వాయిదాలు వేసిందని పేర్కొన్నారు. దీనిపై ఏఐటీయూసీ 2022 లో గౌరవ హైకోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేసి విజయం సాధించడం వల్లనే నేడు 7 సారి సింగరేణిలో ఎన్నికలు జరుగుతున్నాయని వారు తెలిపారు. తమ తమ పాయిదా కోసం వాయిదా వేయించిన సంఘాలు ఇప్పుడు కార్మికులను ఓట్లేలా అడుగుతారని వారు ప్రశ్నించారు. కారుణ్య నియామకాల పేర కాసుల దందా నడిపిన టిబిజికేఎస్, 10 సంవత్సరాలుగా నిద్ర పోయిన ఐఎన్టీయూసీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆగిపోయిన తమ గడియారాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారని వారు విమర్శించారు. అధికార పీఠాన్ని చూసి మాత్రమే యూనియన్లు నడిపే వారిని కార్మిక వర్గం నమ్మకూడదని వారు కోరారు.నిరసనలు, నిరాహార దీక్షలు, అవసరమైతే సమ్మెలు చేసైనా హక్కులు సాధించిన చరిత్ర ఏఐటీయూసీకి మాత్రమే ఉందని వారన్నారు. సింగరేణి లో గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు కూడా పోరాటాలకు, కేసులకు వెనుకాడకుండా నిలిచిన యూనియన్ ఏఐటీయూసీ అని, ఎల్లవేళలా కార్మికులకు అండదండగా ఉండే జెండా అని వారు పేర్కొన్నారు. డిసెంబర్ 27 న జరిగే ఎన్నికల్లో నక్షత్రం గుర్తును గుర్తుంచుకొని ఏఐటీయూసీని గెలిపించుకోవాలని వారు కార్మిక వర్గంకు విజ్ఞప్తి చేశారు. ఫిట్ కార్యదర్శి ఎం సంపత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు రంగు శ్రీనివాస్, గౌతం గోవర్దన్, గోడిశల నరేష్ దొంత సాయన్న, ఎం. చక్రపాణి, సిద్దమల్ల రాజు, కన్నం లక్ష్మీనారాయణ, ఎం.ఏ.గౌస్, శనగల శ్రీనివాస్, కీర్తి శేఖర్, శశాంక్, కిరణ్, ఏ.వి.ఎస్. ప్రకాష్, రంజిత్, శ్రీను,రమేష్, సూర్య , ఆర్.రాజేశ్వరరావు, బుర్ర భాస్కర్, పడాల కనకరాజ్, ఎర్రగొల్ల చేరాలు, బూడిద మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News