ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఓవైపు సొంత పార్టీ అధికార నేతలు, కార్పొరేటర్లు.. సొంత పార్టీ పైనే తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. తమ డివిజన్లలో అభివృద్ధి చేయడం లేదంటూ కొంతమంది కార్పొరేటర్లు విన్నత నిరసన తెలియజేస్తుండగా మరికొన్ని డివిజన్ లలో నాయకులు సొంత పార్టీ పైన వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉండపట్ల పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి.పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ అభివృద్ధి విషయంలో అధికార పార్టీకి చెందిన కార్పోరేటర్లు స్వరం పెంచుతున్నారు. కార్పోరేషన్ పరిధిలోని ప్రధాన కూడలి లక్ష్మి నగర్ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజి వ్యవస్థపై కార్పోరేటర్లతో పాటు వ్యాపారులు వినూత్న నిరసన చేపట్టారు. రామగుండం కార్పోరేషన్ పరిధిలోని వ్యాపార కేంద్రం అయిన లక్ష్మినగర్ లో కిరాణా దుకాణాలు, వైద్య కేంద్రాలు, బంగారం దుకాణాలతో పాటు అన్ని రకాల వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తుంటారు. అయితే స్థానికంగా కార్పోరేషన్ అధికారులు ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టంతో పాటు డ్రైనేజి వ్యవస్థపై నిర్లక్ష్యం వహిస్తుండంతో వ్యాపారులతో పాటు కార్పోరేటర్లు తిరుగు బాటు ఎగుర వేశారు. పట్టణంలో ప్రధాన కూడలి కావడం గత పది రోజుల నుంచి డ్రైనేజి నీరు రోడ్డుపై వస్తుండటంతో తమ వ్యాపారులు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ శనివారం రోడ్డుపై వినూత్న నిరసన చేపట్టారు. వీరికి స్థానిక అధికార పార్టీ కార్పోరేటర్లు మద్దతు ప్రకటించారు. రోడ్డుపై బైఠాయించి వ్యాపార కేంద్రాలను అభివృద్ది చేయాలని డిమాండ్ చేశారు. గత నెలలో మన్సిపల్ మంత్రి కెటిఆర్ పర్యటన సందర్భంగా ప్రధాన రోడ్లను యుద్ద ప్రాతిపధికగా అభివృద్ధి చేయగా, స్థానికంగా వ్యాపార కేంద్రంగా ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని కార్పోరేటర్లతో పాటు వ్యాపారస్థులు ఆరోపించారు. తక్షణమే వ్యాపార కేంద్రానికి నిధులు మంజూరు చేసి పనులు చేయాలని డిమాండ్ చేశారు. అయితే కార్పోరేషన్ మేయర్ కు సంబంధించిన ఆసుపత్రి సైతం లక్ష్మినగర్ ప్రాంతంలో ఉండటం గమనార్హం. అయితే నిత్యం ఈ ప్రధాన రహదారి నుండే వెళ్లే మేయర్ కు సొంత పార్టీ కార్పొరేటర్ నుండే చేదు అనుభవం ఎదురైయింది. దీంతో ఇది చూసిన స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
Admin
Aakanksha News