ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : తెలుగు సినీ చరిత్రలో ఓ సంచలనాత్మక డైరెక్టర్ గతంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఓ యదార్ధ ఘటనను ఆధారంగా చేసుకుని ఓ సినిమాను నిర్మించాడు... ఈ సినిమాలో ఫ్యాక్షన్ సన్నివేశాలను కండ్లకు కట్టినట్లు చూపించాడు.. అదే తరహాలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కొంతమంది రౌడీషీటర్ల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది.. ఈ హత్య జరిగి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న వారి మధ్య ఉన్న ప్రతీకారంతోనే మరో రౌడీషీటర్ హత్య జరిగినట్లు జోరుగా చర్చ సాగుతుంది.. వివరాల్లోకి వెళ్లితే... గోదావరిఖని హనుమాన్ నగర్ లో స్నేహితుని పుట్టినరోజు సందర్భంగా ఓ మద్యం దుకాణంలో కొంత మంది మద్యం సేవిస్తున్న క్రమంలో వారి మధ్య చిన్నపాటి ఘర్షణ హత్యకు దారి తీసింది. దీంతో మూడేళ్లుగా ఈ హత్యకు సంబంధించిన ప్రతికారం కొనసాగుతున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. 30 జూన్ 2020 న హనుమాన్ నగర్ లో మున్నా అనే యువకుడిని అతికిరాతకంగా కొంతమంది కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన జరిగి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుండగా ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న మరో రౌడీషీటర్ మంథని సుమన్ ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. గతంలో సైతం సదరు రౌడీషీటర్ పై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తుంది.. అయితే 2020 సంవత్సరంలో హత్య జరిగిన మున్నా కు సంబంధించిన వారే మంథని సుమన్ ను హత్య చేసి ఉంటారని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే జనసంద్రంగా ఉండే గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో అందరూ చూస్తుండగానే రౌడీషీటర్ మంథని సుమన్ హత్య జరగడం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంచలనంగా మారింది. కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న పారిశ్రామిక ప్రాంతంలో అలజడి నెలకొంది. ప్రధాన చౌరస్తాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహించే సుమన్ హత్యకు గురయ్యాడని తెలియడంతో చుట్టుపక్కల స్థానికులు భారీగా చేరుకున్నారు. ఇప్పటికే హత్యపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
Admin
Aakanksha News