ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : అసలు ఎవరు.... నకిలీలు ఎవరు...ఆర్ఎఫ్ సీఎల్ బ్రోకర్లు ఎవరు..అనేది ప్రజల్లో తేల్చుకునే సమయం వచ్చిందని రామగుండం బీఆర్ఎస్ ఆశావహులు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి, రామగుండం నగరపాలక సంస్థ తొలి మాజీ మేయర్ కొంక్కటి లక్ష్మీనారాయణ, బసంత్ నగర్ పర్మినెంట్ కార్మిక సంఘం నాయకులు బయ్యపు మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాతిపల్లి ఎల్లయ్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ...ఈ నెల 6వ తేదీన గోదావరిఖని మార్కండేయ కాలనీలోని బృందావన్ గార్డెన్ లో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ ఆశావాహులు వెల్లడించారు. అలాగే రామగుండం నియోజకవర్గం పూర్తిగా అవినీతి మాయమైందని విమర్శించారు. నగర పాలక సంస్థకు అధికారులు రావాలంటేనే భయపడుతున్నారని అన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఎంతో మంది యువతను ఉద్యోగాల పేరుతో మోసం చేసారని వెంటనే వారి దగ్గర తీసుకున్న డబ్బులను పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఉద్యోగాల పేరుతో మోసపోయిన యువత సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 3వ సారి ముఖ్యమంత్రిని చేయాలని పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు.రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయవద్దని మా ఐదుగురిలో ఒకరికి టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే పార్టీకి నష్టం చేస్తూ అవినీతి పాలన కొనసాగిస్తున్నాడని అన్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొన్నారు. ఇదే క్రమంలో భవిష్యత్తులో ఇక్కడ పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గతంలో ఎంతో మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేశామని గుర్తు చేశారు.
Admin
Aakanksha News