Wednesday, 06 May 2026 05:19:00 PM

భాధితులకేది బారోసా....?

0

Date : 03 October 2022 05:27 AM Views : 552

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : రామగుండం ఎరువుల కర్మాగారంలో జరిగిన ఉద్యోగాల దందాపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఉద్యోగ దందాలో నిరుద్యోగుల నుండి కొందరు అధికార పార్టీ పేరుతో లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు దళారులకు వ్యతిరేకంగా రోడ్డు ఎక్కడంతో రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగాల దందా బయటపడింది. దీంతో అధికార పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. ఇప్పటికే ఈ ఉద్యోగ దందాలో పలువురిని అరెస్టు చేసి పోలీసులు కటకటాల్లోకి పంపారు. అయితే ఇందులో ఇంకా మరి కొంతమంది పాత్ర ఉందని వారిపై కూడా విచారణ చేపట్టి కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే లక్షల రూపాయలు దళారులకు ఇచ్చి మోసపోయిన బాధితులు వరుసగా ఒక్కొక్కరు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం సంచలనంగా మారుతుంది. దళారులకు లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయానని మనస్థాపం చెందిన ముంజ హరీష్ అనే యువకుడు సోషల్ మీడియాలో తన చావుకు ఎవరు కారణం ఎవరికీ ఎంత ఇచ్చాను అనే దానిపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆత్మహత్య చేసుకోవడం పెను సంచలనంగా మారింది. అంతే కాకుండా తనలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని నా చావుతోనైనా రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉన్న బాధితులు అందరికీ న్యాయం జరగాలని తిరిగి ప్రతి ఒక్కరికి డబ్బులు చెల్లించాలని తన చావును స్ఫూర్తిగా తీసుకొని పోరాటాలు నిర్వహించాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. అయితే దీనిపై అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు స్పందించి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఈ ఘటన మరువక ముందే మరో బాధితుడు తెచ్చిన డబ్బులకు వడ్డీ కట్టలేక మరోవైపు ఉద్యోగం లేక మనస్థాపంతో పాలకుర్తి మండలానికి చెందిన ముంజంపల్లి గ్రామానికి చెందిన గంగుల శేఖర్ 10 లక్షల రూపాయలను స్థానికంగా ఉండే దళారీలకు ఇచ్చి మోసపోయనని మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా గమనించిన కుటుంబ సభ్యులు సకాలంలో ఆస్పత్రి తరలించడంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. దీంతో స్పందించిన కొంత మంది పార్టీల నాయకులు న్యాయం చేయాలని హడావిడి చేసి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొని చేతులు దులుపుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మరువక ముందే గోదావరిఖని తిలక్ నగర్ కు చెందిన అపరాధి శ్రీనివాస్ అనే యువకుడు గోదావరి సమ్మక్క సారక్క గద్దెల వద్ద పత్తి మందు తాగి అనంతరం ఒకటో పట్టణ సీఐకి ఫోన్ లో సమాచారం అందించాడు.దీంతో అప్రమత్తమైన సీఐ రమేష్ బాబు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితుడు పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ఇలా డబ్బులు పెట్టి ఉద్యోగాల పేరుతో మోసపోయిన ఎంతో మంది బాధితులు మానసికంగా కృంగిపోయి క్షణికావేశంలోనో, లేక ఆర్థిక ఇబ్బందులనో భరించలేక ఆత్మహత్యయత్నాలకు ప్రయత్నించడం రామగుండం నియోజకవర్గంలో అలజడి సృష్టిస్తుంది. ఇప్పటికే దాదాపు 9 నెలలుగా బాధితులు ఎదురు చూస్తున్న తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తుంది.ఎంతసేపు న్యాయం చేస్తామని చెప్పే వాళ్లే కానీ ఎలా చేస్తారో బాధితులకు స్పష్టంగా తెలిపే వారు లేక పోవడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో రామగుండం అగ్నిగుండంగా మారుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలయాపనతో కాలం వెల్లదిస్తున్న వైనం.... రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో మోసపోయిన బాధితులకు న్యాయం చేస్తామని చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం ఇప్పటివరకు బాధితులకు సరైన హామీ కూడా ఇవ్వకపోవడంతో ఎంతో మంది నిరుద్యోగులు మానసికంగా కృంగిపోయి ఆందోళన చెందే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇంత జరుగుతున్న కొంతమంది నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రశ్నార్థకంగా అఖిలపక్ష కమిటీ...? ఉద్యోగాల పేరుతో మోసపోయిన ప్రతి నిరుద్యోగి నుండి వివరాలు సేకరించామని ఇందులో ఎంత మంది పాత్ర ఉంది...? ఎవరెవరు ఎంత వసూళ్లు చేశారు అనే దానిపై నివేదిక తయారు చేశామని త్వరలోనే బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి ఇలా ఎన్నో ప్రకటనలు చేసి అఖిలపక్ష కమిటీ ప్రశ్నార్థకంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు చర్చల పేరుతో నెలలు గడుస్తున్న ఇప్పటివరకు బాధితులకు ఏటువంటి న్యాయం జరగకపోవడంపై ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇంత జరుగుతున్న దీనిపై కొందరు నాయకులు ఇతర పార్టీల నాయకులపై విమర్శలు చేస్తూ ఉండగా తమకు ఎలాంటి సంబంధం లేదని పూర్తి బాధ్యత వారే అని ఒకరిపై ఒకరు చెప్పుకోవడం పట్ల ప్రజల్లో, నిరుద్యోగుల్లో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయం చేస్తామని చెప్తూ నెలలు గడుస్తున్న ఎటువంటి ఫలితం లేకపోవడంతో బాధితులు ఆత్మస్థైర్యం కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్నాయని పలువురు మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా కానీ అనధికారకంగా కానీ పూర్తిస్థాయిలో నిరుద్యోగులతో బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి వారికి జరిగిన అన్యాయంపై ఆరా తీయక పోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్ ఎఫ్ సీ ఎల్ లో చీకటి రాజకీయం... రామగుండం ఎరువుల కర్మాగారంలో చీకటి రాజకీయం నడుస్తుందా...? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాల పేరుతో కోట్లాది రూపాయలు చేతులు మరీనా దీనిపై ఒకరినొకరు విమర్శలు చేసుకుంటూ కాలం వెళ్ళదిస్తున్నారనే కానీ బాధితులకు న్యాయం కోసం పోరాటం చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ని నెలలు గడుస్తున్నా ఇప్పటికి బాధితులకు భరోసా కల్పించడంలో కొంతమంది నాయకులు విఫలం చెందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖద్దర్ చొక్కా ముసుగులో నడుస్తున్న రాజకీయ చదరంగంలో కొంతమంది నాయకులు బాధితులను పావులుగా వాడుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో బాధితులకు భరోసా కల్పించే నాయకుడు కనిపించక పోవడంతో క్షణికవేశ నిర్ణయాలకు పాల్పడుతున్నారు. ప్రారంభం నుండే దోపీడీ ఆరంభం అయ్యిందా...? రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభం నుండే కొందరు ఖద్దరు చొక్కా నాయకులు దోపిడీని ప్రారంభించారా...? అంటే అవునానే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఎంతో మంది కార్మికులు రామగుండం ఎరువుల కర్మాకారంలో పని చేసే సమయంలో ఫ్యాక్టరీ మూతపడడంతో కొంతమంది ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో తమ సొంత ఊర్లోకి వెళ్ళిపోతే మరి కొంతమంది కూలి నాలి చేసుకుంటూ జీవనోపాధిని పొందుతున్నారు. మరి కొంతమంది మాజీ ఉద్యోగులు వివిధ కారణాలతోనో లేక అనారోగ్య సమస్యలతోనో మృతి చెందారు. ఇలా ఎంతోమంది పోరాటాల ఫలితంగా మళ్లీ పున ప్రారంభమైన రామగుండం ఎరువుల కర్మాగారంలో మాజీ ఉద్యోగుల పిల్లలతో పాటు స్థానికేతర ఆధారంగా కల్పించాల్సిన ఉద్యోగాలను కొందరు నాయకులు కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల దగ్గర నుండి లక్షల రూపాయలను అందిన కాడికి దండుకున్నారు. దీంతో మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు రోడ్డు ఎక్కడంతో ఈ వివాదం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నిరుద్యోగులకు భద్రత ఏది..? దళారుల చేతులో ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు మోసపోయిన నిరుద్యోగుల భద్రత నామమాత్రంగానే మిగిలిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. న్యాయం చేస్తామని చెప్పిన నెలలు గడుస్తున్న తమకు ఎటువంటి భరోసా లేకపోవడంతో తెచ్చిన వాటికి అప్పులు కట్టలేక, ఉద్యోగం లేక కుటుంబ కలహాలతో, తమ కుటుంబాన్ని పోషించుకోలేక మానసిక వేదనకు గురవుతూ మనస్థాపంతో బాధితులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. అయినా దీనిపై స్పందించిన దాఖలాలే కనిపించడం లేదు. దీంతో రామగుండం ఎరువుల కర్మగారం బాధితుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారుతుంది... కాగితాలకే పరిమితమైన లెక్కలు..? రామగుండం ఎరువుల కర్మాకారంలో మోసపోయిన ప్రతినిరుద్యోగికి వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పిస్తామని చెప్పిన నాయకుల లెక్కలు కాగితాలకే పరిమితమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతమంది నిరుద్యోగులు ఎవరికి ఎంత ఇచ్చారు అనే దానిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, బాధితుల నుండి వివరాల అడిగి తెలుసుకుంటున్నామని చెప్పి నెలలు గడుస్తున్న అవి లెక్కలు కాగితాలకే పరిమితం కావడం కలవరపెడుతుంది. అసలు ఇప్పటివరకు ఎంతమంది బాధితులు ఎవరెవరికి ఇచ్చారు అనే దానిపై వివరాలు సేకరించారా...? సేకరిస్తే వాటిని కాగితాలకే ఎందుకు పరిమితం చేశారు...? అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు అందరి చిట్టా బయటపెడతామని చెప్పిన నాయకులే కనుమరుగయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా బాధితులకు న్యాయం జరగకపోతే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రామగుండం ఎరువుల కర్మాగారం వివాదం రానున్న రోజుల్లో ఎటువైపు దారితీస్తుందో అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :