ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : అక్షరాలు దిద్దించాల్సిన చేతులు ఆయుధాలుగా మారుతున్నాయ అంటే అవుననే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.పాఠశాలలో చదువు చెప్పాల్సిన కొంతమంది సిబ్బంది విద్యార్థులను దండిస్తున్న తీరు అందరిని కలిచివేస్తుంది. కనీస వయసు కూడా నిండని విద్యార్థులపై కనికరం లేకుండా ప్రవర్తిస్తున్న తీరు ఆగ్రహానికి గురి చేస్తుంది. ఇప్పటికే గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో కొన్ని పాఠశాలలు వివాదాస్పదంగా మారుతుంటే మరి కొన్ని పాఠశాలలో విద్యార్థులను చితకబాదిన సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటూ ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురికావాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే... పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కళ్యాణ్ నగర్ లోని వర్షిణి ప్రైమరీ పాఠశాలలో గత రెండు రోజుల క్రితం యూకేజీ చదువుతున్న ఆదర్ర్వ్ అనే విద్యార్థిడిని ఓ టీచర్ పెన్నుతో పొడవడంతో కంటి వద్ద బాలుడికి గాయమైంది. దీంతో ఈ సంఘటనపై విద్యార్థి తండ్రి శివకుమార్ పాఠశాల యాజమాన్యంపై ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పాటు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులపై వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందే పరిస్థితులు నెలకొంటున్నాయి....
విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమా....?
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కొన్ని పాఠశాలలలో ఈ మధ్యకాలంలో విద్యార్థులను వరుసగా చితకబాదిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలపై విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కి కొన్ని పాఠశాలల యాజమాన్యాల తీరుపై ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. అయితే ఇంత జరుగుతున్న పారిశ్రామిక ప్రాంతంలోని విద్యాశాఖ అధికారులు సదురు పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఓవైపు విద్యార్థుల తల్లిదండ్రులు, మరోవైపు విద్యార్థి సంఘం నాయకులు రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన కూడా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం ఈ ఘటనలపై ఇప్పటివరకు సదురు పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకున్న దాఖలాలే కనిపించడం లేదు. ఇప్పటికైనా వరుసగా జరిగిన ఈ సంఘటనలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
Admin
Aakanksha News