ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం దూకుడు పెంచింది. రెండు రోజుల క్రితం విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్ బృందాన్ని ప్రభుత్వం నియమించింది. ఇందులో తాజాగా ఎక్సైజ్ శాఖ అధికారులను కూడా బృందంలో సభ్యులుగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ.స్వామినాధన్, ఎ.జనార్ధన్ రావు, ఇన్స్‌పెక్టర్‌లు వైకుంఠరావు, దుర్గా ప్రసాద్, రమేష్, శేషయ్య, శ్రీనుబాబు, రమణలను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం. వీరందరినీ వెంటనే రిలీవ్ చేసి విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.కాగా.. మద్యం కుంభకోణంపై నియమించిన సిట్ బృందం సీఐడీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని.. ప్రతీ 15 రోజులకు ఒకసారి నివేదికను రూపొందించి సీఐడీ చీఫ్ ద్వారా ప్రభుత్వానికి అందించాలని గతంలోనే ఆదేశించింది. ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం సిట్‌కు ఉంటుందంటూ వారికి పోలీస్‌స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేసి.. అధికారాలను కట్టబెట్టింది కూటమి ప్రభుత్వం. తాజాగా మద్యం కుంభకోణంపై విచారించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా అవసరం అవుతారని ప్రభుత్వం భావించింది. దీంతో ఎక్సైజ్ అధికారుల సహకారం తీసుకునేందుకు ఆ డిపార్ట్‌మెంట్‌లో కొంతమంది అధికారులను సిట్ బృందంలో నియమించాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ప్రభుత్వానికి వినతి చేశారు.
Admin
Aakanksha News