Wednesday, 12 February 2025 04:01:46 AM

విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ.11,440 కోట్లతో భారీ ప్యాకేజీ..

Date : 18 January 2025 06:39 AM Views : 127

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. విశాఖ ఉక్కు పరిశ్రమకు భారీ ప్యాకేజీ ప్రకటించింది. రూ.11,440 కోట్లతో కేంద్రం ప్యాకేజీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అధికారిక ప్రకటనలో తెలిపారు. విశాఖ ఉక్కు ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ గురువారం సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఏటా 7.3 మిలియన్‌ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నది. ఈ కంపెనీ 2023-24లో రూ.4,848.86 కోట్ల నష్టపోయింది. అంతకు ముందు 2022-23లో రూ.2,858.74 కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం చేసిన అప్పులు పెరగడం దీనికి ప్రధాన కారణం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం స్టీల్‌ ప్లాంట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేంద్రమంత్రి కుమారస్వామి సైతం ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ప్లాంట్‌కు రూ.18వేలకోట్ల ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. ఆ తర్వాత కొద్దిరోజులకే కేంద్ర ప్రభుత్వం ఉక్కుశాఖ ఎమర్జెన్సీ అడ్వాన్స్‌ ఫండ్‌ కింద జీఎస్టీ చెల్లింపులకు రూ.500 కోట్లు, ముడిసరుకుకు సంబంధించి బ్యాంకు అప్పుల చెల్లింపులకు రూ.1,150 కోట్ల చొప్పున రెండు విడుతల్లో సహాయం అందించింది. తాజాగా రూ.11,440 కోట్లతో ప్యాకేజీని ప్రకటించింది.వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్థాపించారు. భారతదేశంలోని అత్యాధునికమైన ప్రభుత్వరంగ ఉక్కు తయారీదారు. విశాఖపట్టణం నగరానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. జర్మనీ, సోవియట్ రష్యాల సాంకేతిక సహకారంతో ఈ ప్లాంట్‌ను నిర్మించారు. స్టీల్‌ ప్లాంట్‌ ఉత్పత్తులు దేశ విదేశాల్లో మంచి పేరున్నది. సంస్థ రాబడిలో 80శాతం జపాన్, జర్మనీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దుబాయి, సింగపూర్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాలకు చేయబడుతున్న ఎగుమతుల ద్వారానే వచ్చాయి. 2010 నవంబరు 10న నవరత్న హోదా పొందింది. అయితే, గత కొద్ది సంవత్సరాలుగా స్టీల్ ఫ్యాక్టరీ నష్టాల్లో కొనసాగుతున్నది. కంపెనీ అప్పులు భారీగా పేరుకుపోయాయి.ఆ తర్వాత స్టీల్‌ ఉత్పత్తికి అవసరమైన ఐరన్‌ ఓర్‌, బొగ్గు సరఫరా బాగా తగ్గిపోయింది. దాంతో ఉత్పత్తి సైతం విపరీతంగా పడిపోయింది. ఇక నష్టాలను పూడ్చే మార్గం సైతం కంపెనీకి లేకుండాపోయింది. చివరకు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకుంది. కంపెనీపై ఆధారపడ్డ వేలాది మంది ఉద్యోగుల కుటుంబాలు కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ వచ్చారు. ఒక దశలో ఫ్యాక్టరీని కేంద్రం ప్రైవేటీకరించాలని భావించింది. ఉద్యోగులు, కార్మికుల ఆందోళన బాటపట్టారు. దాంతో కేంద్రం వెనక్కి తగ్గింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైజాగ్‌ స్టీల్‌ ఫ్యాక్టరీకి పూర్వవైభవం తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్యాకేజీని ప్రకటించింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :