ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో త్వరలోనే పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం లో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి దుర్గేశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల విజయవాడ వివంత హోటల్‌లో నిర్వహించిన ఇన్వెస్టర్ల సమ్మిట్ చర్చకు వచ్చింది. దీంతో ఆ సమ్మిట్‌లో వచ్చిన ప్రతిపాదనలపై అధికారులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరగా వాటిని పట్టాలెక్కించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.అలాగే పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి పనుల ప్రగతిపైనా మంత్రి సమీక్షించారు. పనులకు సంబంధించిన పలు వివరాలను అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. త్వరలోనే ఆయా పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తానని, తానే స్వయంగా పర్యాటకాభివృద్ధి పనులు పర్యవేక్షిస్తానని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు విశేష ప్రాచుర్యం కల్పించాలని మంత్రి ఆదేశించారు.ఏపీలో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రాంతాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తే పెద్దఎత్తున వాటిని సందర్శించే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. తద్వారా పర్యాటకశాఖకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. అలాగే ప్రజలకు కూడా మన చరిత్ర గురించే తెలిసే అవకాశం ఉంటుందని దుర్గేశ్ చెప్పుకొచ్చారు. అనంతరం మంత్రి దుర్గేశ్‌తో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజీత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురూ సినిమాటోగ్రఫీ శాఖపై విస్తృతంగా చర్చించారు.
Admin
Aakanksha News