ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. వైఎస్ జగన్ ముఖ్య అనుచరుడు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విజయసాయి రెడ్డి.. ఇదే తన చివరి ట్వీట్ అని పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం.. ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. వైసీపీలో టాప్ లీడర్‌గా ఉన్న విజయసాయి.. సడెన్‌గా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ‘రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి జనవరి 25వ తేదీన రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయపార్టీలోనూ చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్‌కు, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకు సదా కృతజ్ఞుడిని. వైఎస్ జగన్‌కు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్‌గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశాను. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశాను. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, హోం మంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించాను. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్‌తో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.’ అని విజయసాయి రెడ్డి పోస్ట్ చేశారు.
Admin
Aakanksha News