Sunday, 19 April 2026 02:54:47 PM

చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు... అలాంటి బెదిరింపులను ఎవరూ నమ్మవద్దు

ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు...

Date : 29 December 2024 05:42 AM Views : 285

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు పలువురు వ్యక్తులను బెదిరించి కోట్లు కొల్లగొడుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని, అలాంటి బెదిరింపులను ఎవరూ నమ్మవద్దని స్పష్టంచేశారు.గత కొంతకాలంగా సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని ద్వారకా తిరుమలరావు అన్నారు. ఈ ఏడాది సైబర్ క్రైమ్‌కు సంబంధించి 916 కేసులు నమోదు చేశామని డీజీపీ వెల్లడించారు. 2024లో సైబర్ నేరాల ద్వారా మోసగాళ్లు రూ.1,229 కోట్లు తస్కరించారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.సామాజిక మాధ్యమాల్లో అభ్యంతకర పోస్టులు పెట్టడంపై ఇప్పటిదాకా 572 కేసులు నమోదు చేశామని, ఆయా కేసుల్లో నిందితులపై రౌడీ షీట్ తరహాలో సైబర్ షీట్ తెరుస్తామని చెప్పారు. మార్చి 31 నాటికి కమాండ్ కంట్రోల్ కార్యాలయంతో 1 లక్ష సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తామని తెలిపారు. ఇప్పటికే 25 వేల సీసీ కెమెరాలను వినియోగిస్తున్నామన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఈగల్’ వ్యవస్థ గంజాయి, డ్రగ్స్ కేసుల్లో ప్రజల్లోకి బలంగా వెళుతోందని చెప్పారు.గంజాయి కాకుండా ఇతర పంటలు సాగు చేయాలని గిరిజనులకు చెబుతున్నామని డీజీపీ వెల్లడించారు. ఇక దేశంలో తొలిసారిగా ఏపీలోనే ‘స్మార్ట్ పోలీస్ ఏఐ’ని ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఏలూరు జిల్లా పోలీసులు ‘స్మార్ట్ పోలీస్ ఏఐ’ని ప్రారంభించారని వివరించారు. నేరాల నమోదు నుంచి కేసు విచారణ వరకు ‘స్మార్ట్ పోలీస్ ఏఐ’ సాంకేతికత సాయం తీసుకుంటున్నట్టు వెల్లడించారు.విజయవాడలో ట్రాఫిక్, ప్రజా రద్దీ నియంత్రణకు ఏఐ సాంకేతికత ఓ అస్త్రంలా ఉపయోగపడుతుందని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భద్రతా వలయంలోకి నకిలీ ఐపీఎస్ చొరబడడం పట్ల విచారణ జరుపుతున్నామని డీజీపీ వెల్లడించారు. భూ కబ్జాలు, ఇసుక అక్రమ తవ్వకాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పీడీ యాక్ట్ కేసులు పెడతామని తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :