ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : భారత దేశంలో బడుగు బలహీన వర్గాలకు ఇతర అగ్రవర్ణాలతో సమానంగా అన్ని హక్కులు, పోరాడే అవకాశాలు కల్పించిన ఈ తరం మహనీయుడు సామాన్యులకు నిత్యం చిరస్మరణీయుడైన డా. బి.ఆర్ అంబేడ్కర్ జన్మదినం, వర్ధంతిని ఏ ఒక్క రోజుకో పరిమితం చేసుకోవడం కాకుండా ప్రతి రోజు గుర్తుంచుకోవాల్సిన అవసరం వుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, జనసేన నాయకుడు బి.ఎన్.రాజు అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంధర్భంగా బి.ఎన్.రాజు మాట్లాడుతూ ఈ నాడు మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆలోచించు కోవాడానికి అనువైన పరిస్థితులు కల్పించిన గొప్పతనం అంబేద్కర్ దేనని, రాజ్యాంగంలోని ప్రతి విభాగ రచనలో మిగతా వారి కృషితో పాటు, అంబేడ్కర్ ముందుచూపు కనబడుతుందన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఈరోజు మననం చేసికోవడం అంటే మన స్ఫూర్తిదాత జీవితాన్ని మనకు స్ఫూర్తి కలగాలని కోరుకోవడమే తప్ప ఆయనకు మనం చేసేది ఏమి లేదన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, విద్యాధికుడు, తత్వవేత్త సంపాదకుడు, విప్లవకారుడు, దార్శనికుడు, చరిత్ర కారుడు, ప్రాసంగికుడు, రచయిత, దళిత జన బాంధవుడు, అర్ధ శాస్త్రజ్ఞుడు, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖ అమాత్యులు, న్యాయవాది, బౌద్ధ ధర్మ పునరుద్ధారకుడు, భారతరత్న డాక్టర్ భీమ్ రావు రాంజీ అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. 1881 ఏప్రిల్ 14న నాటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరం ఐన మూమ్ ఊరిలో రాంజీ మలోజి సాక్పాల్, భీమాబాయి దంపతులకు 14వ, చివరి సంతానంగా జన్మించిన భీమ్ రావు, క్రమశిక్షణతో పెరిగి ప్రతిదినం రామాయణ భారత, తుకారాం, మోరోపంత్ ల గీతాలు గానం చేసేవారని, ఆధునిక మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో అంబావడే పట్టణంలో ఆయన కుటుంబం జీవించినందున, మరాఠీ నేపథ్యాన్ని కలిగి ఉన్నారు. వారి కుటుంబం శాకాహారం తీసుకునేది. మొహర్లు అస్పృశులుగా, పరిగణింపబడిన కాలంలో, బాల్యం నుండి అంటరాని తనాన్ని ఎదుర్కొని, ఎన్నో అవమానాలకు గురైనారని, 1996లో ప్రాథమిక విద్య, ఎలిఫిస్టన్ హైస్కూల్ లో 1907లో ఎస్ ఎస్ ఎల్ సీ పూర్తి చేసి, 1908లో 16వ ఏటనే రమా బాయ్ తో వివాహం జరగడం, అనంతరం బరోదా మహారాజు షాయాజీ గాయేక్వాడ్ ద్వారా 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో ఏలిఫిస్టన్ కళాశాలలో బిఏ ఉత్తీర్ణులు అయ్యారన్నారు. 1913లో రాజుగారి ఆర్థిక సాయంతో కొలంబియా యూనివర్సిటీలో చేరి, 1915 లో ఎం.ఏ, పీహెచ్ డీ సాధించారు. 1917లో తిరిగి వచ్చి మహారాజు మిలిటరీ కార్యదర్శిగా పనిచేశారు. కొల్హాపూర్ మహా రాజు సాహు మహారాజ్ సహాయంతో, “మూక్ నాయక్" పక్ష పత్రికకు సంపాదకత్వం వహించారు. సాహూ మహరాజ్ సాయంతో 1920లో విదేశీ చదువులకు పయనమయ్యారు. 1922లో బారిస్టర్ ఎట్ లాకు ఆహ్వానం అందడం, 1927 మార్చి 20న మహద్ చెరువు నీరు స్వీకరించి పోరాటం జరిపారు. 1927లో "బహిష్కృత భారతి" మరాఠీ పక్ష పత్రిక ప్రారంభించి, 1927 డిసెంబర్ 25న "మనుస్మృతి"ని దహనం చేశారన్నారు. 1930లో నాగపూర్ ప్రసిద్ధ ఉపన్యాసం గావించారు. 1930 నవంబర్ 12న మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారని, 2వ సమావేశంలో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు విషయంలో మహాత్మా గాంధీతో తీవ్రంగా విభేదించారన్నారు. 1932లో రాంసే మెక్ డొనాల్డ్ "కమ్యునల్ అవార్డు" ప్రకటన ద్వారా ప్రత్యేక నియోకవర్గాల ప్రతిపాదన జరిగిందన్నారు. పూనా ఒప్పందం ద్వారా కమ్యునల్ అవార్డు కన్నా ఎక్కువ స్థానాలు వుమ్మడి నియోజకవర్గాలలో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. 1935 మార్చి 4న రమాబాయ్ మరణించింది. 1936లో కుల నిర్మూలన గ్రంథాన్ని రచించారు. 1942 జూలై 18న షెడ్యూలు కులాల ఫెడరేషన్ ను స్థాపించారు. 1942 నుండి 1946 వరకు వైస్రాయి క్యాబినెట్ లో "కార్మిక మంత్రి"గా పని చేశారు. 1947 ఆగస్టు 3న "న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అగస్టు 19న రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ గా నియమితులైనారు. 1948 ఏప్రిల్ 15న తమ 5వ ఏట బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శారదా కబీర్ ను ద్వితీయ వివాహమాడారు. నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందింది. 1951లో న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి, 1952లో ముంబాయి శాసన సభ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1956 అక్టోబర్ 14న నాగపూర్ లో బౌద్ధ మతం స్వీకరించారు. డిసెంబర్ 6న ఢిల్లీలో పరమపదించారు. అంబేడ్కర్ మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పాళీ సంస్కృతం, బెంగాలీ, పర్షియన్, ఫ్రెంచ్, జర్మన్ తదితర భాషలలో ప్రావీణ్యత సాధించడమే కాక పాళీ ఇంగ్లీష్ నిఘంటువు కూడా రాశారు. ఆయనను ఒక వ్యక్తిగా కాక, శక్తిగా, మహెరీద్యమంగా, విద్యావేత్తగా, సాంఘిక సంస్కర్తగా, స్వతంత్ర ప్రతిభకు చిరునామాగా, సాహిత్య వ్యాప్తికి నిరంతర కృషి సల్పి మానవత్వాన్ని, సకల జన సంక్షేమాన్ని కోరిన భారత రత్నంగా, ప్రతి భారతీయుడు పూర్తిగా స్ఫూర్తిని తీసుకోవాల్సి ఉందన్నారు.
Admin
Aakanksha News