ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : సమైక్య భారతి, పశ్చిమబెంగాల్ తెలుగుజాతి ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ పట్టణంలో సూర్య కళా మందిరంలో నిర్వహించిన దాశరధి కృష్ణమాచార్యులు శతజయంతి సభలో పిఠాపురం యువ సాహితీవేత్త, రచయిత, అసిస్టెంట్ ప్రొఫెసర్, విశ్లేషకుడు, రాచకొండ నరసింహశర్మ సాహితీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కిలారి గౌరీనాయుడికి ఘన సన్మానం జరిగింది. తెలుగువారు గర్వించదగ్గ సంగీత దర్శకులు స్వర్గీయ సాలూరి నాగేశ్వరరావు కుమారుడు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సాలూరి వాసురావు చేతుల మీదుగా గౌరీ నాయుడు సత్కారం అందుకున్నారు. అభ్యుదయ సాహిత్య చరిత్రలో ప్రఖ్యాతి చెందిన దాశరథి కృష్ణమాచార్యుల శతజయంతి జాతీయ సదస్సులో గౌరీ నాయుడు ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఈ సభలో దాశరధి అభ్యుదయ సాహిత్యం - జాతీయ సమైక్యత అనే అంశంపై అతిథి ప్రసంగం చేశారు. నిజాం పాలకుల చేతుల్లో స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కోల్పోయి జీవచ్చవాల్లా బ్రతుకుతున్న తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి నిజాం పాలనపై దిక్కారస్వరం వినిపించిన ఉద్యమ వైతాళికుడు దాశరధి కృష్ణమాచార్యులు శత జయంతి సభలో పాల్గొనే అవకాశం రావడం చాలా సంతోషాన్ని కలిగించిందని గౌరీ నాయుడు తెలిపారు. పిఠాపురం నాగేశ్వరరావుతో మా తాత పక్కుర్తి సుబ్బారావుకి ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ, పిఠాపురం నాగేశ్వర రావు శిష్యుడిగా సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాలూరు నాగేశ్వరావు సత్కరించడం జీవితంలో మరిచిపోలేని ఒక సంఘటనగా గుర్తిండిపోతుందని గౌరీనాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ పూర్వ చైర్మన్ పైడా వెంకటనారాయణ, వినియోగదారుల సమైక్య రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బమిడిపాటి కామేశ్వరరావు, గిడుగు రామ్మూర్తి మనవడు గిడుగు నాగేశ్వరరావు, గురజాడ అప్పారావు ముని మనవడు విజయ్ గోపాల్, పశ్చిమబెంగాల్ తెలుగుజాతి ఐక్యవేదిక అధ్యక్షుడు చంద్రశేఖర రావు గౌరీనాయుడుని అభినందించి జ్ఞాపిక ప్రశంసా పత్రంతో సత్కరించి సాహిత్య రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జాతీయస్థాయి సదస్సులో సత్కరించిన సంస్థ నిర్వాహకులకు గౌరీ నాయుడు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Admin
Aakanksha News