Saturday, 26 September 2026 07:19:17 PM

అధికార పార్టీలో టికెట్ చిచ్చు…

బీఫామ్ వివాదంతో రాజకీయ రణక్షేత్రంగా మారిన రామగుండం...

Date : 03 February 2026 03:58 PM Views : 791

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : మున్సిపల్ ఎన్నికల వేళ పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వరుస వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే రాజకీయ ఉద్రిక్తతలతో నిత్యం చర్చనీయాంశంగా నిలుస్తున్న రామగుండంలో తాజాగా అధికార పార్టీలో టికెట్ వివాదం తీవ్ర కలకలం రేపింది. పార్టీ అంతర్గత అసమ్మతులు బహిరంగంగా బయట పడటంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది.వివరాల్లోకి వెళితే… రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీపీసీ లో డివిజన్‌కు సంబంధించిన బీ ఫారం కేటాయింపులో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార పార్టీకి చెందిన ఒకే డివిజన్‌కు ఇద్దరు అభ్యర్థులకు బీ ఫారం కేటాయించినట్లు సమాచారం. ఈ క్రమంలో బీ ఫారం సమర్పణ సమయంలో ఇద్దరు అభ్యర్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కీలక దశలో ఉన్న సమయంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఎవరి వద్ద అసలైన బీ ఫారం ఉందనే అంశంపై అయోమయం నెలకొనడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో డివిజన్ పరిధిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.బీ ఫారం కేటాయింపులో జరిగిన తప్పిదమా, లేక ఉద్దేశపూర్వక రాజకీయ ఎత్తుగడలేనా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ అధిష్టానం నుంచి స్పష్టత రాక పోవడంతో వివాదం మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్న తరుణంలో ఈ టికెట్ చిచ్చు అధికార పార్టీకి తలనొప్పిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.మొత్తానికి రామగుండం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీలో చోటు చేసుకున్న ఈ బీ ఫారం వివాదం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధిష్టానం ఈ అంశాన్ని ఎలా పరిష్కరిస్తుందో, చివరకు ఆ డివిజన్‌లో ఎవరు అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :