ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / రంగారెడ్డి జిల్లా : మహేశ్వరం నియోజకవర్గంలో ముంపు సమస్యను తక్షణం పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి మున్సిపల్ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. మీర్‌పేట, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనేక కాలనీలు వరద ముంపుతో ఇబ్బందులు పడుతున్నాయని తెలుసుకున్న ఎమ్మెల్యే, అధికారులు, బీఆర్‌ఎస్ నేతలతో కలిసి ముంపు ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు.వరద కాల్వల్లో పేరుకుపోయిన చెత్త, మురుగునీటి కారణంగా నీటి ప్రవాహం అడ్డంకులు ఎదుర్కొంటోందని గుర్తించిన ఆమె, చెత్త తొలగింపులో నిర్లక్ష్యం చూపుతున్న మున్సిపల్ యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "నాలాలో చెత్త పేరుకుపోతే వరద నీళ్లు ఎలా పోతాయి?" అని ప్రశ్నించిన ఆమె, సమస్యను ఒకరిపై ఒకరు నెట్టివేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.చెరువులోకి వరద నీరు చేరకుండా ఎస్‌ఎన్‌డీపీ అధికారులు నిర్మించిన అడ్డగోడపై సబితా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "ఇలా చేస్తే వరద నేరుగా కాలనీల్లోకి వస్తుంది" అని ఆమె కాలనీ వాసుల ఆవేదనను విన్నారు. రాత్రి నుంచి ముంపులోనే ఉన్నామని నివాసులు వాపోవడంతో, గోడను తక్షణమే తొలగించాలని ఆమె అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.వరద కాల్వలపై అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించిన ఆమె, రెడ్డి బ్యాటరీ సమీపంలో జరుగుతున్న అనుమతి లేని నిర్మాణాన్ని వెంటనే ఆపాలని ఆదేశించారు. నాలాలలో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి, ముంపు బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ పర్యటనలో కమిషనర్ వాణిదేవి, అదనపు కమిషనర్, డీఈ, ఏఎంసీ నాగేందర్ రెడ్డి, డీఈ వేణుగోపాల్, బీఆర్‌ఎస్ నాయకులు రామిడి రాంరెడ్డి, ఏనుగు రాంరెడ్డి, బోయపల్లి శేఖర్ రెడ్డి, అర్కల భూపాల్ రెడ్డి, జలాల్‌పూర్ సునితా బాల్‌రాజ్, అశోక్, శ్రీనివాస్ గుప్త, మాదారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News