ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / వనపర్తి జిల్లా : దసరా పండుగ సందడి మధ్య ఓ కొత్త అల్లుడు, అత్తమామల ఇంట్లో జరిగిన వినూత్న సంఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. పండుగ ఆనందంలో భాగంగా అత్తమామలు 101 రకాల వంటకాలతో అల్లుడి కోసం విందు ఏర్పాటు చేయగా, ఒక వంటకం తగ్గిందని నిరూపించి అల్లుడు తులం బంగారం బహుమతిగా గెలుచుకున్నాడు.వివరాల్లోకి వెళ్తే—కొత్తకోట పట్టణానికి చెందిన గుంట సురేశ్, సహనా దంపతులు తమ కుమార్తె సింధును రెండు నెలల క్రితం వరంగల్‌కు చెందిన నికిత్ అనే యువకుడికి వివాహం చేశారు. పెళ్లి అనంతరం వచ్చిన ఇది మొదటి పెద్ద పండుగ కావడంతో దంపతులు అల్లుడు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంప్రదాయంగా కొత్త అల్లుడికి ఘనంగా స్వాగతం పలికి, విందు వడ్డించారు. దసరా రోజున అత్తమామలు అల్లుడిని సంతోషపరచేందుకు 101 రకాల రుచికరమైన వంటకాలతో భోజన విందు ఏర్పాటు చేశారు. వేపుడు, కూరలు, పచ్చళ్లు, చట్నీలు, పప్పులు, స్నాక్స్, స్వీట్స్—మొత్తంగా భోజన పందిరి రంగురంగుల వంటకాలతో కళకళలాడింది. వంటకాలు వడ్డించే ముందు అత్త సహనా సరదాగా మాట్లాడుతూ..మా అల్లుడి కోసం 101 రకాల వంటలు చేశాం” అని గర్వంగా చెప్పడంతో, నికిత్ కాస్త చిలిపిగా స్పందించాడు.అవును అత్తగారూ, నిజంగానే 101 వంటకాలు చేశారో లేదో నేను లెక్కేస్తా. ఒకటి తగ్గితే ఏం ఇస్తారు?” అని సరదాగా అడిగాడు. అత్తమామలు కూడా ఆటలో పాల్గొని “ఒక వంటకం తగ్గిందని నిరూపిస్తే తులం బంగారం ఇస్తాం” అని నవ్వుతూ అన్నారు.ఆ తర్వాత అల్లుడు ఒక్కొక్క వంటకం లెక్కపెట్టాడు. చివరికి మొత్తం 100 రకాల వంటకాలు మాత్రమే ఉన్నాయని నిరూపించాడు. అత్తమామలు కూడా లెక్క వేసి చూసి నిజమే అని గుర్తించారు. మాట నిలబెట్టుకుంటూ అత్త నికిత్‌కు తులం బంగారం బహుమతిగా అందజేశారు.ఈ సంఘటనతో ఇరువైపుల కుటుంబాలు నవ్వుల్లో మునిగిపోయాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగు వారు ఈ హాస్యభరిత సంఘటనను ఆస్వాదించారు. సోషల్ మీడియాలో ఈ ఘటన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.దసరా పండుగ సందర్భంగా కుటుంబం అంతా ఒకచోట చేరి నవ్వులు పంచుకోవడం, సరదాగా ఆడుకోవడం ఎంత ఆనందదాయకమో కొత్తకోట కుటుంబం చూపించింది. అత్త, అల్లుడు మధ్య స్నేహభావం, సరదా ప్రేమల మిశ్రమం ఈ సంఘటనలో ప్రతిబింబించింది.దసరా రోజున కొత్తకోటలో జరిగిన ఈ సంఘటన, సాంప్రదాయ పండుగలతో పాటు మనుషుల మధ్య ఉన్న ఆప్యాయతకు చక్కటి ఉదాహరణగా నిలిచింది.
Admin
Aakanksha News