Monday, 16 March 2026 05:38:16 PM

రాజకీయ జోక్యంతో సింగరేణి కార్మిక హక్కులకు ముప్పు... నాలుగు లేబర్ కోడ్ల రద్దుకు ఈ నెల 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె...

సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల పిలుపు...

Date : 03 February 2026 12:12 PM Views : 278

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : సింగరేణి సంస్థలో పని చేస్తున్న కార్మికుల మనుగడ హక్కులు తీవ్రమైన ప్రమాదంలో పడ్డాయని కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థలో పెరుగుతున్న రాజకీయ జోక్యమే ఇందుకు ప్రధాన కారణమని వారు విమర్శించారు. కార్మికుల రక్షణకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు ప్రకటించారు. సింగరేణిలో జరుగుతున్న పరిణామాలు కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని, కార్మిక చట్టాల పేరుతో హక్కులను కాలరాస్తున్నారని నేతలు ఆరోపించారు. ఉద్యోగ భద్రత, వేతనాలు, పని గంటలు, భద్రతా ప్రమాణాలు వంటి కీలక అంశాలపై లేబర్ కోడ్లు కార్మికులకు నష్టం కలిగిస్తున్నాయని తెలిపారు. ఈ కోడ్ల అమలుతో కాంట్రాక్ట్, మనుగడ కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, టీబీజీకేఎస్ వంటి అన్ని ప్రధాన కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాష్ట్ర స్థాయి నాయకులు సీతారామయ్య, మడ్డి ఎల్లా గౌడ్, ధర్మపురి సదానందం, రాజారెడ్డి, తుమ్మల, మంద నరసింహారావు, మాదాసి రామమూర్తి, కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, నూనె కొమురయ్య, వైవీ రావు, రవీందర్ జిగురు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేతలు మాట్లాడుతూ, కార్మికుల ఐక్యతే ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు సరైన సమాధానమని అన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు, ఉద్యోగి ఈ సార్వత్రిక సమ్మెలో భాగస్వామిగా నిలవాలని పిలుపునిచ్చారు. సమ్మెను జయప్రదం చేయడం ద్వారా కార్మిక హక్కుల పరిరక్షణకు బలమైన సంకేతం పంపాలని వారు పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :