ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / : భారత క్రికెట్ వికాసానికి ఎనలేని సేవలందించిన మాజీ బీసీసీఐ అధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్ బింద్రా (84) కన్నుమూశారు. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. బింద్రా మృతి భారత క్రికెట్ పరిపాలన రంగానికి తీరని లోటుగా క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.క్రికెట్ నిర్వాహకుడిగా బింద్రా తనదైన ముద్ర వేశారు. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో భారత క్రికెట్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. టెలివిజన్ ప్రసార హక్కులకు సంబంధించిన దూరదర్శన్ కేసుతో ఒక దశలో ఆయన వార్తల్లో నిలిచినా, సమర్థవంతమైన పరిపాలనాధికారిగా గుర్తింపు పొందారు.భారత క్రికెట్ నిర్మాణంలో సంస్థాగత మార్పులు, వసతుల అభివృద్ధి దిశగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంద్రజిత్ సింగ్ బింద్రా మృతిపట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్ర సంతాపం ప్రకటిస్తూ, ఆయన సేవలను స్మరించింది.
Admin
Aakanksha News